ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ నేడు (మే 17) పునఃప్రారంభం కానుంది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవడతంతో ఈ 18వ సీజన్ గత వారంలో హఠాత్తుగా ఆగిపోయింది. ఇప్పుడు రీస్టార్ట్ అయ్యేందుకు రెడీ అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‍కతా నైట్‍రైడర్స్ జట్లు నేడు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ పోరు రెండు జట్లకు కీలకంగా మారింది. అయితే వర్షం ముప్పు కూడా ఉంది.
కోల్‍కతాతో జరిగే నేటి మ్యాచ్‍లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది. గ్రూప్ దశలో మరో రెండు మ్యాచ్‍లు మిగిలి ఉండగానే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. గెలిస్తే టాప్ ప్లేస్‍కు కూడా వెళుతుంది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే కోల్‍కతా నైట్‍రైడర్స్ తప్పనిసరిగా ఈ మ్యాచ్ గెలివాల్సింది. ఓడిపోతే రేసును నుంచి అజింక్య రహానే టీమ్ ఔట్ అవుతుంది. దీంతో ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది.
బెంగళూరు, కోల్‍కతా మ్యాచ్‍కు వర్షం ముప్పు ఉంది. మ్యాచ్ ప్రారంభమయ్యే సాయంత్రం 7.30 గంటల సమయంలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే, రాత్రి 9 తర్వాత వాన పడే అవకాశం లేదని వెల్లడిస్తున్నాయి. దీంతో మ్యాచ్‍కు వర్షం అంతరాయం కల్పించినా.. పూర్తిగా రద్దయ్యే అవకాశాలు లేనట్టే కనిపిస్తున్నాయి. అందులోనూ చిన్నస్వామి స్టేడియంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది.
బెంగళూరులో వారం రోజులుగా వానలు పడతున్నాయి. రీసెంట్‍గా చిన్నస్వామి స్టేడియంలో నిలిచిన నీటిలో ఆర్సీబీ ప్లేయర్ టిమ్ డేవిడ్ కిందమీదా పడుతూ ఎంజాయ్ చేశాడు. అయితే, నేటి సాయంత్రం స్వల్ప వర్షమే పడే ఛాన్స్ ఉంది. మ్యాచ్ జరిగే అవకాశాలు అధికం.
కొంతకాలంగా వానలు పడుతుండటంతో చిన్నస్వామి స్టేడియం పిచ్ కాస్త తేమగా ఉండనుంది. దీనివల్ల ఆరంభంలో పేసర్లకు పిచ్ సహకరించే అవకాశం ఉంది. మంచి స్వింగ్ లభిస్తుంది. బంతి పాతబడ్డాక బ్యాటింగ్‍కు అనుకూలంగా ఉండొచ్చు. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేసేందుకే మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్ట (అంచనా): విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, మయాంక్ అగర్వాల్, రజత్ పటిదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, లుంగీ ఎంగ్డీ, యశ్ దయాల్
కోల్‍కతా నైట్‍రైడర్స్ తుది జట్టు (అంచనా): రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరేన్, అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, అంగ్‍క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, ఆండ్రే రసెల్, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా
సంబంధిత కథనం