IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసిందోచ్.. ఆరంభం ఎప్పుడంటే? కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ తో స్టార్ట్
IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22న కొత్త సీజన్ కు తెరలేవనుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ తో ఆర్సీబీ తలపడనుంది. ఫైనల్ మే 25న జరుగుతుంది. 13 స్టేడియాల్లో మొత్తం 74 మ్యాచ్ లు నిర్వహిస్తారు.

క్రికెట్ అభిమానులను టీ20 కిక్కులో ముంచేసేందుకు ఐపీఎల్ 2025 వచ్చేస్తోంది. ఈ మెగా లీగ్ కొత్త సీజన్ షెడ్యూల్ ను ఆదివారం (ఫిబ్రవరి 16) ప్రకటించారు. మార్చి 22 నుంచి మే 25 వరకు ఈ సీజన్ జరుగుతుంది. ఈ సారి 13 స్టేడియాల్లో మొత్తం 74 మ్యాచ్ లు జరుగుతాయి. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ కు కూడా ఈడెన్ గార్డెన్స్ వేదిక.
కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ
ఐపీఎల్ ఆనవాయితీ ప్రకారం తొలి మ్యాచ్ ను డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ఆడుతుంది. ఆర్సీబీతో ఆ జట్టు తలపడుతుంది. చివరగా కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ సీజన్ ఆరంభ మ్యాచ్ లో పోటీపడింది 2008 లీగ్ ప్రారంభ సీజన్ లో కావడం విశేషం. మొత్తం 65 రోజుల పాటు ఐపీఎల్ 2025 సీజన్ సాగుతుంది. ఇక రెండు నెలలకు పైగా అభిమానులకు ధనాధన్ విందు ఖాయమే. 12 డబుల్ హెడర్ (రోజుకు రెండు మ్యాచ్ లు)లు ఉన్నాయి.
ఉప్పల్ లో ఎప్పుడంటే?
గత సీజన్ రన్నరప్ సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి ఉప్పల్ స్టేడియంలో పరుగుల వేటకు సిద్ధమైంది. ఆ జట్టు మార్చి 23న ఉప్పల్ లో తొలి మ్యాచ్ ఆడుతుంది. రాజస్థాన్ రాయల్స్ ను ఢీ కొడుతుంది. ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ మొత్తం 7 మ్యాచ్ లు ఆడుతుంది. అంతే కాకుండా రెండు ప్లేఆఫ్స్ మ్యాచ్ లకూ ఆతిథ్యమివ్వనుంది. మే 20న క్వాలిఫయర్-1, మే 21న ఎలిమినేటర్ మ్యాచ్ లు హైదరాబాద్ లో జరుగుతాయి.
విశాఖ లో రెండు మ్యాచ్ లు
ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియాన్ని సెకండ్ హోం గ్రౌండ్ గా ఎంచుకుంది. ఇక్కడ ఆ జట్టు రెండు మ్యాచ్ లు ఆడనుంది. మార్చి 25న లక్నో సూపర్ జెయింట్స్ తో ఢిల్లీ ఇక్కడ తలపడుతుంది. మార్చి 30న మధ్యాహ్నం మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడుతుంది.
10 ఫ్రాంఛైజీల హోం గ్రౌండ్స్ కాకుండా ఈ సారి అదనంగా 3 స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతాయి. గువాహటి (రాజస్థాన్ రాయల్స్ సెకండ్ హోం గ్రౌండ్)లో రెండు, విశాఖపట్నం (ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ హోం గ్రౌండ్)లో రెండు, ధర్మశాల (పంజాబ్ కింగ్స్ సెకండ్ హోం గ్రౌండ్)లో మూడు మ్యాచ్ లు జరుగుతాయి.
సంబంధిత కథనం