ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు లక్ కలిసి రావడం లేదు. సొట్టబుగ్గల చిన్నది ప్రీతి జింటాకు చెందిన ఈ టీమ్ 17 ఏళ్లలో ఒక్కసారి కూడా ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవలేకపోయింది. స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నా పంజాబ్ కు మాత్రం కప్ కలిసి రావడం లేదు. 17 ఏళ్లుగా టైటిల్ వెయిటింగ్ కొనసాగుతూనే ఉంది. ఈ సారి ఆ టీమ్ కు కొత్త కెప్టెన్ గా వచ్చిన శ్రేయస్ పై ఆ ఫ్రాంఛైజీ కోటి ఆశలు పెట్టుకుంది.
ఐపీఎల్ 17 సీజన్లలో పంజాబ్ కింగ్స్ ఒక్కసారి మాత్రమే ఫైనల్ చేరింది. 2014లో ఆ టీమ్ రన్నరప్ గా నిలిచింది. ఆ ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో టీమ్ ఓడింది. ఆ తర్వాత మళ్లీ ఆ టీమ్ ఫైనల్ చేరలేదు. 2008లో సెమీఫైనల్ మినహాయిస్తే మిగతా సీజన్లలో కనీసం ప్లేఆఫ్స్ కూడా రీచ్ కాలేదు . వరుసగా గత 10 సీజన్లలో ఆ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది.
గత ఐపీఎల్ సీజన్ లో కెప్టెన్ గా కేకేఆర్ ను ఛాంపియన్ గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ పై పంజాబ్ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. వేలంలో శ్రేయస్ ను రూ.26.75 కోట్లకు కొనుక్కోవడమే కాకుండా కెప్టెన్ గా సెలెక్ట్ చేసింది. సూపర్ ఫామ్ లో ఉన్న కెప్టెన్ శ్రేయస్, కోచ్ పాంటింగ్ తో కలిసి పంజాబ్ రాత మారుస్తాడని జట్టు నమ్ముతోంది.
పంజాబ్ కింగ్స్ కు ఆల్ రౌండర్ల బలం ఉంది. మార్కో యాన్సెన్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మార్కస్ స్టాయినిస్, అజ్మతుల్లా ఒమర్ జాయ్, శశాంక్ సింగ్ లాంటి ఆల్ రౌండర్లు ఆ జట్టులో ఉన్నారు. ఇక ఫుల్ టైమ్ కెప్టెన్ గా శ్రేయస్ వచ్చాడు. శ్రేయస్ కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. యుజ్వేంద్ర చాహల్ రూపంలో నాణ్యమైన స్పిన్నర్ ఉన్నాడు.
బలమైన ఓపెనింగ్ పెయిర్ లేకపోవడం పంజాబ్ బలహీనత. ప్రభ్ సిమ్రన్ సింగ్ తో కలిసి స్టాయినిస్ లేదా ఇంగ్లిస్ ఓపెనింగ్ చేసే అవకాశముంది. ఇక అర్ష్ దీప్ సింగ్ తప్ప పేస్ బౌలింగ్ లో మరో నమ్మదగ్గ బౌలర్ కనిపించడం లేదు. ఫెర్గూసన్, కుల్ దీప్ సేన్ ఎలా రాణిస్తారో చెప్పలేం. మరోవైపు విదేశీ ఆటగాళ్లపై ఆ జట్టు అతిగా ఆధారపడుతుంది. ఇది కూడా జట్టుకు మైనస్ గా మారే అవకాశముంది.
సంబంధిత కథనం