ఐపీఎల్ 2025 కిక్కులో మునిగిపోయేందుకు తెలుగు ఫ్యాన్స్ రెడీ అయ్యారు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఈ సీజన్ లో నేడే ఫస్ట్ మ్యాచ్. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
ప్రమాదకర బ్యాటర్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పటిష్ఠంగా కనిపిస్తోంది. ఓపెనర్లుగా విధ్వంసకర పెయిర్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మరోసారి సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. ఇక మెగా వేలంలో దక్కించుకున్న యంగ్ డైనమైట్ ఇషాన్ కిషన్ కు తుది జట్టులో చోటు దక్కింది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ టాప్ ఆర్డర్లో ఆడబోతున్నాడు. ఇక వైజాగ్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మరోసారి అట్రాక్షన్ గా నిలవబోతున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ కూడా బలంగానే ఉంది. రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ పూర్తి ఫిట్ నెస్ సాధించకపోవడంతో ఈ సీజన్ లో తొలి మూడు మ్యాచ్ లకు రియాన్ పరాగ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడబోతున్నాడు.
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు స్వర్గధామం. ఈ పిచ్ పై గత ఐపీఎల్ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో చెలరేగి కొత్త రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లోనూ బ్యాటింగ్ ఊచకోత కొనసాగించేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సై అంటోంది.
సంబంధిత కథనం