ఐపీఎల్ లో 300 స్కోరు చేసిన ఫస్ట్ టీమ్ గా హిస్టరీ క్రియేట్ చేయాలనే టార్గెట్ తో ఈ సీజన్ లో అడుగుపెట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్. తొలి మ్యాచ్ లోనే అందుకు దగ్గరగా వచ్చి ఆగిపోయింది. మార్చి 23న ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో సన్‌రైజర్స్ 286/6 స్కోరు చేసింది. ఇప్పుడు మరోసారి సొంతగడ్డపై చెలరేగేందుకు సిద్దమైంది. నేడు (మార్చి 27) లక్నో సూపర్ జెయింట్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతోంది.
ఐపీఎల్ 2024 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ తీరే పూర్తిగా మారిపోయింది. కమిన్స్ కెప్టెన్సీలో ఆ జట్టు దూకుడుగా ఆడుతోంది. భారీ స్కోర్లతో రికార్డుల పంట పండిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు 300కు చేరువగా వచ్చి ఆగిపోయింది. గతేడాది ఆర్సీబీపై 287 పరుగులు చేసింది. ఐపీఎల్ హిస్టరీలో ఇదే అత్యధిక స్కోరు. ఈ సీజన్ లో తన తొలి మ్యాచ్ లోనే రాజస్థాన్ రాయల్స్ పై 286 స్కోరు సాధించింది. ఇక ఈ సీజన్ లోనే 300 స్కోరు టార్గెట్ ను రీచ్ కావాలనే లక్ష్యంతో సన్‌రైజర్స్ ఉంది.
గురువారం ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఎల్ఎస్జీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 300 స్కోరు అందుకుంటుందేమో చూడాలి. ఇదే గ్రౌండ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 286 స్కోరు చేసిన సన్‌రైజర్స్ హాట్ ఫామ్ లో ఉంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి లాంటి బ్యాటర్లతో టీమ్ ప్రమాదకరంగా ఉంది. తొలి మ్యాచ్ లో ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ బాదాడు.
మరోవైపు లక్నో మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది. రిషభ్ పంత్ తన ఫ్రాంచైజీకి డెబ్యూ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. అతను డకౌట్ అయ్యాడు. అతని కెప్టెన్సీపై కూడా విమర్శలు వచ్చాయి. ఢిల్లీ బ్యాటర్ అశుతోష్ శర్మ సెన్సేషనల్ ఇన్నింగ్స్ తో టీమ్ ను గెలిపించాడు.
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ సాయంత్రం 7 గంటలకు వేస్తారు. మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. మ్యాచ్ జియోహాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.
సంబంధిత కథనం