ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం (మార్చి 23) మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డుల దుమ్ము దులిపింది. ధనాధన్ బ్యాటింగ్ తో అదరగొట్టింది. ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరపున తొలి మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కిషన్ సన్సేషనల్ సెంచరీతో సత్తాచాటాడు. టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ కేవలం 47 బంతుల్లో 106 పరుగులు చేయగా, ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 67 పరుగులు సాధించాడు.
76- రాజస్థాన్ రాయల్స్ ప్రమాదకర పేసర్ జోఫ్రా ఆర్చర్ ను సన్ రైజర్స్ బ్యాటర్స్ ఉతికారేశారు. అతను తన 4 ఓవర్లలో 76 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ అతడే. జోఫ్రా ఆర్చర్ రెండేళ్ల తర్వాత ఐపీఎల్లోకి పునరాగమనం చేసి టోర్నీ చరిత్రలోనే అత్యంత చెత్త గణాంకాలను నమోదు చేశాడు. గత సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున మోహిత్ శర్మ (0/73) రికార్డును ఆర్చర్ అధిగమించాడు.
286- ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్. ఐపీఎల్ హిస్టరీలో ఓ టీమ్ చేసిన రెండో అత్యధిక స్కోరు ఇదే. హైయ్యస్ట్ స్కోర్ రికార్డు కూడా సన్ రైజర్స్ దే. గత సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 287/3 పరుగులు చేసింది.
4- టీ20 చరిత్రలో అత్యధిక 250+ స్కోర్లు సాధించిన జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. టీ20 మ్యాచ్ లో 250కి పైగా సన్ రైజర్స్ పరుగులు సాధించడం ఇది నాలుగో సారి. భారత పురుషుల క్రికెట్ జట్టు, ఇంగ్లీష్ జట్టు సర్రేను సన్ రైజర్స్ వెనక్కి నెట్టింది.
1000- ఐపీఎల్ లో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన రెండవ ఆటగాడిగా క్లాసెన్ నిలిచాడు. లీగ్ లో కేవలం 594 బంతుల్లో 1000 పరుగులు సాధించాడు. ఇది టోర్నమెంట్ చరిత్రలో రెండవ వేగవంతమైనది. దక్షిణాఫ్రికా పవర్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ (545) మాత్రమే అగ్రస్థానంలో ఉన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, గ్లెన్ మ్యాక్స్ వెల్, యూసుఫ్ పఠాన్ లాంటి ఆటగాళ్లను క్లాసెన్ అధిగమించాడు. ప్రపంచ క్రికెట్లో పవర్ హిట్టర్ గా మరోసారి తన సత్తాచాటాడు.
సంబంధిత కథనం