సీఎస్కేపై గెలిచినా.. సన్ రైజర్స్ కు కష్టమే.. ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్ ఉందా? దుకాణం సర్దేసుకోవాల్సిందేనా?-ipl 2025 sunrisers hyderabad play off chances explained team with 6 points will exit in group stage ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  సీఎస్కేపై గెలిచినా.. సన్ రైజర్స్ కు కష్టమే.. ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్ ఉందా? దుకాణం సర్దేసుకోవాల్సిందేనా?

సీఎస్కేపై గెలిచినా.. సన్ రైజర్స్ కు కష్టమే.. ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్ ఉందా? దుకాణం సర్దేసుకోవాల్సిందేనా?

ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు కాస్త రిలీఫ్. సీఎస్కేపై ఆ టీమ్ విజయం సాధించింది. కానీ ప్లేఆఫ్స్ చేరే దారి మాత్రం కఠినంగానే కనిపిస్తోంది. మరి ఆ టీమ్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూసేద్దాం.

సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ (Surjeet Yadav)

ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగుతోంది. అంచనాలకు మించిన రిజల్ట్ వస్తున్నాయి. అయితే గత సీజన్ రన్నరప్ సన్ రైజర్స్ హైదరాబాద్ కథ మాత్రం ఈ సారి రివర్స్ అయింది. 2024లో ధనాధన్ బ్యాటింగ్ తో రికార్డులు తిరగరాసిన సన్ రైజర్స్.. ఈ సీజన్ లో అదే బ్యాటింగ్ ఫెయిల్యూర్ తో బొక్కబోర్లా పడింది. ఈ సీజన్ లో ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరేందుకు అవకాశాలు చాలా స్వల్పం.

6 పాయింట్లతో

ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచ్ ల్లో 3 గెలిచింది. ఆరు మ్యాచ్ ల్లో ఓడింది. శుక్రవారం (ఏప్రిల్ 25) సీఎస్కేపై విజయం సాధించింది. దీంతో ఆ టీమ్ ఖాతాలో పాయింట్లు ఆరుకు చేరాయి. కేకేఆర్ కూడా ఆరు పాయింట్లతోనే ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ లో వెనుకబడ్డ సన్ రైజర్స్ టేబుల్ లో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.

ఆ మ్యాచ్ లు గెలవాలి

ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరే ఆశలు నిలవాలంటే ముందుగా ఆ టీమ్ ఆడబోయే 5 మ్యాచ్ లూ గెలవాలి. ఆ టీమ్ ఇంకా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడాలి. ఇవన్నీ గెలిస్తే సన్ రైజర్స్ పాయింట్లు 16 అవుతాయి. అప్పుడు కూడా నెట్ రన్ రేట్ కీలకంగా మారే అవకాశముంది.

అంత ఈజీ కాదు

ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ రన్నరప్ గా నిలిచింది. కానీ ఈ ఐపీఎల్ సీజన్ లో సారి ప్లేఆఫ్స్ చేరడమూ కష్టంగానే కనిపిస్తోంది. టీమ్స్ కనీసం 14 పాయింట్లు సాధిస్తే ముందంజ వేసే అవకాశముంటుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ ఆరేసి విజయాలతో 12 పాయింట్లతో టాప్-3లో ఉన్నాయి. ఈ టీమ్స్ ప్లేఆఫ్స్ చేరడం దాదాపు ఖాయమే.

ఇక ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ 10 పాయింట్ల చొప్పున సాధించాయి. ఈ మూడు జట్ల మధ్య ఓ ప్లేఆఫ్స్ చోటు కోసం పోరు రసవత్తరంగా సాగే అవకాశముంది. అంతేకాకుండా సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే గుజరాత్, ఢిల్లీ, బెంగళూరు లాంటి టాప్ టీమ్స్ ను ఓడించాలి.

అద్భుతం చేస్తుందా?

బ్యాటింగ్ ఫెయిల్యూర్ తో సాగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలు సాధిస్తుందన్న అంచనాలు లేవు. ఒకవేళ అద్భుతం చేసినా నెట్ రన్ రేట్ లో వెనుకబడే అవకాశం ఉంది. ఇలా ఏ రకంగా చూసినా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరేందుకు ఛాన్స్ లు గొప్పగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ సీజన్ లో ఆ టీమ్ జర్నీ లీగ్ దశలోనే ముగుస్తుందని చెప్పొచ్చు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం