ఐపీఎల్ 2025 లో పరుగుల మోతను సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ట్ చేసింది. ఆదివారం (మార్చి 23) ఉప్పల్ స్టేడియాన్ని ఊపేసింది. బ్యాటింగ్ విధ్వంసంతో పరుగుల సునామీ సృష్టించింది. టాస్ గెలిచిన రియాన్ పరాగ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ఎందుకు ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చానా? అని బాధపడి ఉంటాడు.
ఆ రేంజ్ లో బౌలర్లపై విరుచుకుపడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 47 బంతుల్లో అజేయంగా 106 పరుగులు చేశాడు. 11 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. ట్రావిస్ హెడ్ (67) కూడా సత్తాచాటాడు.
ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటేనే బ్యాటింగ్ విధ్వంసానికి మారుపేరుగా మారింది. కనీసం బౌలర్ల మీద కనికరం లేకుండా మరోసారి సన్‌రైజర్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో ప్రారంభం నుంచే రెచ్చిపోయారు. ప్రమాదకర ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ (11 బంతుల్లో 22) భారీ షాట్లతో పరుగుల వేట కొనసాగించారు. ఫారూఖీ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అభిషేక్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. ఆ వెంటనే అభిషేక్ ఔటైనా.. హెడ్ మాత్రం ఆగలేదు.
అభిషేక్ ఔటైన తర్వాత హెడ్ దంచుడు వేరే లెవల్ కు చేరింది. ప్రమాదకర పేసర్ ఆర్చర్ బౌలింగ్ లో హెడ్ సాగించిన విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ అయిదో ఓవర్లో హెడ్ 4 ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు. ఈ సిక్సర్ 105 మీటర్ల దూరం వెళ్లడం విశేషం. పవర్ ప్లేలోనే సన్‌రైజర్స్ 94/1తో నిలిచింది. 21 బంతుల్లోనే హెడ్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. 31 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టిన హెడ్ 67 పరుగులు చేశాడు. అతణ్ని తుషార్ దేశ్ పాండే ఔట్ చేశాడు.
మెగా వేలంలో రూ.11.25 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కోనుగోలు చేసిన ఇషాన్ కిషన్ జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బౌండరీలతోనే సాగిపోయాడు. హెడ్, అభిషేక్ కంటే ఎక్కువగా బంతిని బాదాడు. సిక్సర్ల వేట కొనసాగించాడు. ఆర్చర్ బౌలింగ్ లో వరుసగా రెండు కళ్లు చెదిరే సిక్సర్లు కొట్టాడు. 25 బాల్స్ లోనే ఫిఫ్టీ కంప్లీట్ చేశాడు. అదే ఓవర్లో మరో బంతిని స్టాండ్స్ లో పడేశాడు.
మరో ఎండ్ లో వైజాగ్ కుర్రాడు నితీశ్ కుమార్ (15 బంతుల్లో 30) కూడా సత్తాచాటాడు. నితీశ్ ఔటైనా ఇషాన్ వీర బాదుడు కొనసాగింది. 14.1 ఓవర్లలోనే సన్‌రైజర్స్ స్కోరు 200కు చేరుకుంది.
15వ ఓవర్లోనే సన్‌రైజర్స్ స్కోరు 200 దాటడంతో టీమ్ 300 పరుగులు చేస్తుందేమో అనిపించింది. కానీ చివర్లో సన్‌రైజర్స్ దూకుడు కొనసాగించినా 300 మైల్ స్టోన్ చేరుకోలేకపోయింది. ఇషాన్ తో కలిసి క్లాసెన్ (14 బంతుల్లో 34) పరుగులు తుపాన్ కొనసాగేలా చూశాడు. క్లాసెన్ ఔటైనా.. ఇషాన్ మాత్రం టాప్ గేర్ లోనే కొనసాగాడు.
చివర్లో ఇషాన్ సెంచరీపై ఉత్కంఠ నెలకొంది. కానీ సందీప్ వేసిన 19వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు, రెండు పరుగులతో ఐపీఎల్ కెరీర్లో ఫస్ట్ సెంచరీ అందుకున్నాడు. చివరి వరకూ నిలబడి జట్టు స్కోరును 280 దాటించాడు. ఐపీఎల్ లో తమ అత్యధిక స్కోరు రికార్డుకు సన్‌రైజర్స్ ఒక్క పరుగు దూరంలో ఆగిపోయింది.
సంబంధిత కథనం