ఆర్సీబీకి స‌న్‌రైజ‌ర్స్ స్ట్రోక్‌.. ఫిల్ సాల్ట్‌, కోహ్లి పోరాటం వృథా.. స‌త్తాచాటిన మ‌లింగ‌, క‌మిన్స్‌-ipl 2025 srh vs rcb sunrisers hyderabad stroke to royal challengers bengaluru phil salt kohli fighting in vain eshan ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఆర్సీబీకి స‌న్‌రైజ‌ర్స్ స్ట్రోక్‌.. ఫిల్ సాల్ట్‌, కోహ్లి పోరాటం వృథా.. స‌త్తాచాటిన మ‌లింగ‌, క‌మిన్స్‌

ఆర్సీబీకి స‌న్‌రైజ‌ర్స్ స్ట్రోక్‌.. ఫిల్ సాల్ట్‌, కోహ్లి పోరాటం వృథా.. స‌త్తాచాటిన మ‌లింగ‌, క‌మిన్స్‌

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసుకు దూరమైన సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీని ఓడించింది. ఈ సీజన్ లో అయిదో విజయాన్ని అందుకుంది. ఇషాన్ మలింగ, కమిన్స్ ఆర్సీబీని దెబ్బకొట్టారు.

ఇషాన్ మలింగ, కమిన్స్ (AFP)

ఆర్సీబీకి షాక్. ఐపీఎల్ 2025లో ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ స్ట్రోక్ ఇచ్చింది. శుక్రవారం (మే 23) లక్నోలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 42 పరుగుల తేడాతో ఆర్సీబీని ఓడించింది.

232 పరుగుల ఛేదనలో ఆర్సీబీ 189 పరుగులకే ఆలౌటైంది. ఫిల్ సాల్ట్ (32 బంతుల్లో 62; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), విరాట్ కోహ్లి (25 బంతుల్లో 43; 7 ఫోర్లు, ఓ సిక్సర్) పోరాటానికి ఫలితం లేకుండా పోయింది. కమిన్స్ 3, ఇషాన్ మలింగ 2 వికెట్లతో ఆర్సీబీని దెబ్బకొట్టారు.

దంచుడే దంచుడు

భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్ చెలరేగారు. ఛేజింగ్ లో ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్ కు ఫోర్ తో కోహ్లి బాదుడు మొదలెట్టాడు. బౌండరీలో కొడుతూనే సాగాడు. ఇషాన్ మలింగ ఓవర్లో కోహ్లి ఓ సిక్సర్.. సాల్ట్ ఓ ఫోర్, సిక్సర్ కొట్టడంతో పవర్ ప్లేలోనే ఆర్సీబీ 72 పరుగులు చేసింది.

విరాట్ ఔటైనా

పవర్ ప్లే తర్వాత విరాట్ కోహ్లి ఔటైపోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన యువ స్పిన్నర్ హర్ష్ దూబె.. కోహ్లీని బుట్టలో వేసుకున్నాడు. వికెట్ పడ్డా సాల్ట్ ఆగలేదు. బాదుడు ఆపలేదు. 27 బంతుల్లోనే ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు. ఐపీఎల్ 2025లో మూడో హాఫ్ సెంచరీ అందుకున్నాడు.

వరుస ఓవర్లలో

ఛేజింగ్ లో 10 ఓవర్లకు ఆర్సీబీ 118/1తో నిలిచింది. కానీ వరుస ఓవర్లలో మయాంక్ అగర్వాల్ (11), ఫిల్ సాల్ట్ ను ఔట్ చేసిన సన్ రైజర్స్ కథను మలుపు తిప్పింది. మయాంక్ ను వైజాగ్ కుర్రాడు నితీశ్ కుమార్ ఔట్ చేశాడు. ఫిల్ సాల్ట్ వికెట్ ను కమిన్స్ దక్కించుకున్నాడు.

జితేశ్, రజత్ కలిసి

వరుసగా వికెట్లు పడటంతో ఇబ్బందుల్లో పడ్డ ఆర్సీబీని రెగ్యులర్ కెప్టెన్ రజత్ పాటీదార్ తో కలిసి తాత్కాలిక కెప్టెన్ జితేశ్ శర్మ (24) గెలిపించేందుకు ప్రయత్నించారు. ఈ మ్యాచ్ లో రజత్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడాడు. దీంతో జితేశ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే 15వ ఓవర్లో నితీశ్ కేవలం 5 పరుగులే ఇచ్చాడు.

రనౌట్ తో ఉత్కంఠ

ఆర్సీబీ విజయానికి లాస్ట్ 5 ఓవర్లలో 65 పరుగులు కావాల్సి వచ్చింది. కానీ తర్వాతి ఓవర్లో రజత్ పాటీదార్ రనౌట్ తో ఉత్కంఠ నెలకొంది. ఇషాన్ మలింగ డైరెక్ట్ త్రోతో స్టంప్స్ ను లేపేశాడు. అదే ఓవర్లో డేంజరస్ బ్యాటర్ రొమారియో షెఫర్డ్ ను మలింగ ఔట్ చేశాడు. తర్వాతి ఓవర్లోనే జితేశ్ కూడా పెవిలియన్ చేరడంతో ఆర్సీబీ పనైపోయింది.

కండరాల నొప్పితోనే

ఆర్సీబీని గెలిపించేందుకు టిమ్ డేవిడ్ చేసిన పోరాటం ఆకట్టుకుంది. అంతకుముందు ఫీల్డింగ్ లో కండరాల నొప్పితో మైదానం వీడిన డేవిడ్ తిరిగి బ్యాటింగ్ కు వచ్చాడు. పరుగెత్తే అవకాశం లేకపోవడంతో నిలబడి షాట్లు కొట్టేందుకు ప్రయత్నించాడు. సింగిల్స్ తీయలేదు. కానీ 5 బంతుల్లో ఒక్క పరుగు చేసిన డేవిడ్ ను మలింగ ఔట్ చేశాడు.

కమిన్స్ ఒకే ఓవర్లో భువనేశ్వర్ (3), కృనాల్ పాండ్య‌ (8) వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. కృనాల్ పాండ్య‌ హిట్ వికెట్ గా వెనుదిరగడం గమనార్హం. చివరకు ఆర్సీబీ 189 పరుగులకు ఆలౌటైంది.

ఇషాన్ మెరుపులు

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 6 వికెట్లకు 231 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 94 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) అదరగొట్టాడు. ధనాధన్ షాట్లతో అలరించాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.