ఆర్సీబీకి షాక్ తప్పదా? చితక్కొట్టిన ఇషాన్ కిషన్.. కొద్దిలో సెంచరీ మిస్.. సన్ రైజర్స్ భారీ స్కోరు.. టార్గెట్ ఎంతంటే?-ipl 2025 srh vs rcb ishan kishan blistering knock sets huge target for royal challengers bengaluru sunrisers hyderabad ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఆర్సీబీకి షాక్ తప్పదా? చితక్కొట్టిన ఇషాన్ కిషన్.. కొద్దిలో సెంచరీ మిస్.. సన్ రైజర్స్ భారీ స్కోరు.. టార్గెట్ ఎంతంటే?

ఆర్సీబీకి షాక్ తప్పదా? చితక్కొట్టిన ఇషాన్ కిషన్.. కొద్దిలో సెంచరీ మిస్.. సన్ రైజర్స్ భారీ స్కోరు.. టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ లేటుగా జోరందుకుంది. వరుస ఓటములతో ఇప్పటికే ప్లేఆఫ్స్ కు దూరమైన సన్ రైజర్స్.. ఆర్సీబీపై చెలరేగింది. ఇషాన్ కిషన్ డైనమైట్ లా పేలడంతో భారీ స్కోరు సాధించింది.

ఇషాన్ కిషన్ (PTI)

సన్ రైజర్స్ హైదరాబాద్ డేంజరస్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 94 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) అదరగొట్టాడు. ధనాధన్ బ్యాటింగ్ తో అలరించిన అతను సెంచరీ అందుకోలేకపోయాడు. శుక్రవారం (మే 23) లక్నో స్టేడియంలో ఆర్సీబీతో మ్యాచ్ లో ఇషాన్ చెలరేగాడు. దీంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 231 పరుగులు చేసింది.

ఇషాన్ అదుర్స్

ఐపీఎల్ 2025 సీజన్ లో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసుకు దూరమైన సన్ రైజర్స్ హైదరాబాద్ లేట్ గా చెలరేగింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆ టీమ్ ఆర్సీబీ బౌలర్లను చిత్తుచేసింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ తరపున ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసిన ఇషాన్ మళ్లీ ఇన్ని రోజులకు మంచి ఇన్నింగ్స్ ఆడాడు.

ధనాధన్ ఆరంభం

ఓపెనర్లు అభిషేక్ శర్మ (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), హెడ్ (17) ఉన్నది కాసేపే అయినా మెరిపించారు. ఈ జోడీ అదరగొట్టడంతో నాలుగు ఓవర్లకే సన్ రైజర్స్ 54 రన్స్ చేసింది. కానీ అదే స్కోరు దగ్గర ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అభిషేక్ ను ఎంగిడి, హెడ్ ను భువనేశ్వర్ కుమార్ ఔట్ చేశారు. అక్కడి నుంచి ఇషాన్ షో మొదలైంది.

డైనమైట్ లా పేలాడు

ఇషాన్ కిషన్ డైనమైట్ లా పేలాడు. ఆర్సీబీ బౌలింగ్ ను తుత్తునియలు చేశాడు. ధనాధన్ షాట్లతో అలరించాడు. కవర్ డ్రైవ్ లు, కట్ షాట్లు, లాఫ్టెడ్ షాట్లతో అదరగొట్టాడు. అలవోకగా ఫోర్లు, సిక్సర్లు బాదాడు. హెన్రిచ్ క్లాసెన్ (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అనికేత్ వర్మ (9 బంతుల్లో 26; ఓ ఫోర్, 3 సిక్సర్లు) కూడా భారీ షాట్లతో చెలరేగారు.

వికెట్లు పడ్డా

ఓ ఎండ్ లో వికెట్లు పడ్డా మరో ఎండ్ లో ఇషాన్ కిషన్ నిలబడ్డాడు. క్లాసెన్, అనికేత్ ను ఔట్ చేసి ఆర్సీబీ కాస్త పైచేయి సాధించేలా కనిపించింది. వైజాగ్ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (4) ఫెయిల్ అయ్యాడు. కానీ ఇషాన్ మాత్రం పట్టుదలతో నిలబడ్డాడు. 12 ఓవర్లకే 147/4తో నిలిచిన సన్ రైజర్స్ ఆ తర్వాత కాస్త నెమ్మదించింది.

అదిరే ముగింపు

ఇషాన్ కిషన్ నిలబడి సన్ రైజర్స్ కు అదిరే ముగింపునిచ్చాడు. కచ్చితమైన టైమింగ్ తో షాట్లు కొట్టాడు. అతని విధ్వంసంతో 18 ఓవర్లలోనే టీమ్ స్కోరు 200 దాటింది. లాస్ట్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన ఇషాన్.. లాస్ట్ బాల్ కు సింగిల్ తో ఇన్నింగ్స్ ముగించాడు. 94 పరుగుల దగ్గర ఆగిపోయాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం