ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 190 స్కోరు చేసింది. సాధారణంగా అయితే ఇది భారీ స్కోరే. కానీ 250కి పైగా రన్స్ చేసే సన్‌రైజర్స్ స్టాండర్డ్స్ ముందు ఇది లో స్కోరే. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లే బాదినా.. వికెట్లు పడగొట్టిన లక్నో.. సన్‌రైజర్స్ ను కట్టడి చేసిందనే చెప్పాలి. 300 టార్గెట్ పెట్టుకున్న సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ లో 200 కూడా అందుకోలేకపోయింది.
గురువారం (మార్చి 27) ఉప్పల్ స్టేడియంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 స్కోరు చేసింది. హెడ్ (28 బంతుల్లో 47) టాప్ స్కోరర్. శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు పడగొట్టాడు.
అసలే ఉప్పల్ స్టేడియం.. పైగా దూకుడు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. అలాంటిది టాస్ గెలిచిన పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇంకేముంది సన్‌రైజర్స్ మరోసారి విరుచుకుపడటం ఖాయమే అనిపించింది. కానీ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ లక్నో బౌలర్లు గొప్పగా బౌలింగ్ చేశారు.
ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ప్రమాదకర అభిషేక్ శర్మ (6), గత మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ (0)ను వరుస బంతుల్లో ఔట్ చేసిన శార్దూల్ డబుల్ షాకిచ్చాడు. దీంతో ఉప్పల్ స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.
ఐపీఎల్ 2025లో ఎల్ఎస్జీతో మ్యాచ్ లో స్టార్టింగ్ లోనే రెండు వికెట్లు కోల్పోయినా ట్రావిస్ హెడ్ బాదుడుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరందుకుంది. గాయం నుంచి కోలుకుని వచ్చిన అవేశ్ ఖాన్ బౌలింగ్ లో హెడ్ రెండు కళ్లుచెదిరే సిక్సర్లు బాదాడు. రెండు సార్లు హెడ్ క్యాచ్ ను ఎల్ఎస్జీ ఫీల్డర్లు వదిలేశారు. పవర్ ప్లే లో సన్‌రైజర్స్ 62/2తో నిలిచింది. కానీ పేసర్ ప్రిన్స్ యాదవ్.. హెడ్ వికెట్లను లేపేశాడు. 28 బంతులాడిన హెడ్ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు.
2 సిక్సర్లు, ఓ ఫోర్ బాదిన క్లాసెన్ (17 బంతుల్లో 26) ను బ్యాడ్ లక్ వెంటాడింది. స్ట్రెయిట్ డ్రైైవ్ ఆడిన నితీశ్ క్యాచ్ పేసర్ ప్రిన్స్ యాదవ్ చేతుల్లో నుంచి వెళ్లి నాన్ స్ట్రైకర్ ఎండ్ లో స్టంప్స్ ను లేపేసింది. అప్పటికీ క్లాసెన్ క్రీజు బయట ఉండటంతో పెవిలియన్ చేరక తప్పలేదు. వైజాగ్ కుర్రాడు నితీశ్ కుమార్ (28 బంతుల్లో 32) వేగంగా ఆడలేకపోయాడు. అతణ్ని స్పిన్నర్ రవి బిష్ణోయ్ బోల్తా కొట్టించాడు.
128/5తో సన్‌రైజర్స్ కష్టాల్లో పడ్డ సమయంలో యంగ్ బ్యాటర్ అనికేత్ వర్మ పేలాడు. 13 బంతుల్లోనే 36 పరుగులు చేశాడు. ఏకంగా 5 సిక్సర్లు బాదాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. మరో స్పిన్నర్ దిగ్వేశ్ ఓవర్లోనూ అదే సీన్ రిపీట్ చేశాడు. కానీ తర్వాతి బంతికే ఔటైపోయాడు. వికెట్లు పడుతున్నా బాదుడు మంత్రాన్నే సన్‌రైజర్స్ కొనసాగించింది. ఆ టీమ్ కెప్టెన్ కమిన్స్ కూడా సిక్సర్లతో రెచ్చిపోయాడు.
శార్దూల్ బౌలింగ్ లో వరుసగా రెండు బంతులను స్టాండ్స్ లో పడేశాడు. ఆ తర్వాత అవేశ్ బౌలింగ్ లో ఓ సిక్సర్ కొట్టాడు. కానీ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. చివరకు 200 చేయకుండానే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగించింది.
సంబంధిత కథనం