IPL PBKS vs GT Live: 3 పరుగులతో శ్రేయస్ సెంచరీ త్యాగం.. దంచికొట్టిన పంజాబ్.. గుజరాత్ కు కొండంత టార్గెట్-ipl 2025 shreyas iyer remain unbeaten on 97 punjab kings sets very big target for gujarat titans priyansh arya shashank ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl Pbks Vs Gt Live: 3 పరుగులతో శ్రేయస్ సెంచరీ త్యాగం.. దంచికొట్టిన పంజాబ్.. గుజరాత్ కు కొండంత టార్గెట్

IPL PBKS vs GT Live: 3 పరుగులతో శ్రేయస్ సెంచరీ త్యాగం.. దంచికొట్టిన పంజాబ్.. గుజరాత్ కు కొండంత టార్గెట్

IPL PBKS vs GT Live: శ్రేయస్ అయ్యర్ అదరహో! ఈ పంజాబ్ కెప్టెన్ ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ పై మంగళవారం వీరవిహారం చేశాడు. అతను సిక్సర్లతో దంచికొట్టడంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ భారీ స్కోరు ఖాతాలో వేసుకుంది.

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (AFP)

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఐపీఎల్ లో సరికొత్త ప్రయాణం మొదలెట్టిన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (42 బంతుల్లో 97 నాటౌట్) అదరగొట్టాడు. ఐపీఎల్ 2025లో పంజాబ్ తొలి మ్యాచ్ లో అతను సత్తాచాటాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 9 సిక్సర్లు బాదాడు. టీమ్ కోసం సెంచరీ త్యాగం చేసుకున్నాడు. శ్రేయస్ తో పాటు కుర్రాడు ప్రియాన్ష్ ఆర్య (23 బంతుల్లో 47) చెలరేగాడు. ఆఖర్లో శశాంక్ సింగ్ (16 బంతుల్లో 44 నాటౌట్) రెచ్చిపోయాడు.

మంగళవారం అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ మొదట 20 ఓవర్లలో5 వికెట్లకు 243 పరుగులు చేసింది.

కుర్రాడు కేక

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది. ఐపీఎల్ డెబ్యూలో ఢిల్లీ కుర్రాడు ప్రియాన్ష్ ఆర్య మెరుపు బ్యాటింగ్ తో అలరించాడు. 24 ఏళ్ల ఈ ఓపెనర్ భారీ షాట్లు ఆడాడు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ రెండో బంతికి ఫోర్ తో టీమ్ ఖాతా తెరిచిన ప్రియాన్ష్ ధనాధన్ బ్యాటింగ్ తో సాగిపోయాడు. రబాడ బౌలింగ్ లో మిడాఫ్ లో అర్షద్ క్యాచ్ వదిలేయడంతో దొరికిన ఛాన్స్ ను ప్రియాన్ష్ బెటర్ గా యూజ్ చేసుకున్నాడు.

కెప్టెన్ దంచుడు

సిరాజ్ బౌలింగ్ లో ఆర్య వరుసగా 6, 4 బాదాడు. మరో ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ (5) ఔటైనా.. ఆర్యతో కలిసి కెప్టెన్ శ్రేయస్ విధ్వంసకర బ్యాటింగ్ తో సాగాడు. వస్తూనే ఫోర్ బాదిన శ్రేయస్.. రబాడ బౌలింగ్ లో కళ్లు చెదిరే సిక్సర్ కొట్టాడు. అర్షద్ బౌలింగ్ లో ఆర్య 3 ఫోర్లు, ఓ సిక్సర్ రాబట్టాడు. పవర్ ప్లేలో పంజాబ్ 73/1తో నిలిచింది. ప్రమాదకర స్పిన్నర్ రషీద్ ఖాన్ తన తొలి ఓవర్లోనే ఆర్యను ఔట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. ఆర్య 7 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు.

శ్రేయస్ సిక్సర్లు

10 ఓవర్లకు 104/2తో నిలిచిన పంజాబ్ ఆ తర్వాత కాస్త తడబడింది. స్పిన్నర్ సాయి కిశోర్.. వరుస బంతుల్లో అజ్మతుల్లా (16), మ్యాక్స్ వెల్ (0) ను ఔట్ చేశాడు. మ్యాక్స్ వెల్ 19వ సారి డకౌటై చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. స్టాయినిస్ (20) ను కూడా కిశోర్ పెవిలియన్ చేర్చాడు. కానీ మరో ఎండ్ లో శ్రేయస్ మాత్రం సిక్సర్ల హిట్టింగ్ లో సాగిపోయాడు. కిశోర్ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన శ్రేయస్.. రషీద్ ఖాన్ కు వరుస సిక్సర్లతో శిక్ష విధించాడు. 27 బంతుల్లోనే ఫిఫ్టీ కంప్లీట్ చేశాడు.

ఇక ప్రసిద్ధ్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో శ్రేయస్ విశ్వరూపమే చూపించాడు. వరుసగా 6, 4, 6, 6 బాదేశాడు. చివరి బంతికి కూడా సిక్సర్ వెళ్లాల్సింది కానీ తెవాటియా బౌండరీ దగ్గర గాల్లోకి ఎగిరి బంతిని అందుకుని లోపలికి పడేశాడు.

శశాంక్ మెరుపులు

గతేడాది ఐపీఎల్లో మెరుపు ఇన్నింగ్స్ లతో అదరగొట్టి పంజాబ్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచిన శశాంక్ సింగ్ ఈ మ్యాచ్ లోనూ చెలరేగాడు. డేంజరస్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కు శశాంక్ చుక్కలు చూపించాడు అతని ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టాడు.

సెంచరీ మిస్

శ్రేయస్ సెంచరీపై చివర్లో ఉత్కంఠ నెలకొంది. ఆఖరి ఓవర్ కు ముందు శ్రేయస్ 97 పరుగులతో నిలిచాడు. కానీ సిరాజ్ వేసిన లాస్ట్ ఓవర్లో అన్ని బాల్స్ ను శశాంక్ ఆడాడు. వరుసగా 4, 2, 4, 4, 4, 4 కొట్టాడు. శశాంక్ బాదుడుతో పంజాబ్ స్కోరు 240 దాటినా.. శ్రేయస్ సెంచరీ మిస్ అవడంపై ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. శశాంక్ 16 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 44 పరుగులు చేశాడు.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం