IPL 2025 RR vs KKR: కేకేఆర్ బౌలింగ్ అదుర్స్.. మెరుపుల్లేని రాజస్థాన్ బ్యాటింగ్.. టార్గెట్ ఎంతంటే?
IPL 2025 RR vs KKR: ఐపీఎల్ 2025లో కేకేఆర్ తో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓ మోస్తారు స్కోరు చేసింది. కోల్ కతా బౌలర్లు గొప్పగా బౌలింగ్ చేసి.. ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించారు.
ఐపీఎల్ 2025లో తన రెండో మ్యాచ్ లోనూ రాజస్థాన్ రాయల్స్ తడబడింది. బుధవారం (మార్చి 26) కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లతో రాజస్థాన్ ను కట్టడి చేశారు. రాజస్థాన్ లో ధ్రువ్ జురెల్ (33) టాప్ స్కోరర్.
ఫోర్ తో మొదలైనా
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ మొదట్లో చప్పగా సాగింది. ఐపీఎల్ 2025లో సొంతగడ్డపై రాయల్స్ దూకుడు ప్రదర్శించలేకపోయింది. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (29) ఫోర్ తో ఇన్నింగ్స్ ప్రారంభించినా.. ఆ తర్వాత కేకేఆర్ బౌలర్ల ధాటికి రాజస్థాన్ నెమ్మదించింది. 11 బంతులాడి 13 పరుగులే చేసిన శాంసన్ ను వైభవ్ అరోరా బౌల్డ్ చేశాడు.
మూడు సిక్సర్లకే
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (25), జైస్వాల్ కలిసి రాజస్థాన్ ఇన్నింగ్స్ వేగం పెంచేందుకు ట్రై చేశారు. అరోరా బౌలింగ్ లో చెరో సిక్సర్ బాదడంతో టీమ్ పవర్ ప్లే 54/1తో ముగించింది. కానీ స్పిన్నర్ల రాకతో అంతా తారుమారైంది. రాజస్థాన్ ఇబ్బందులు మరింత పెరిగాయి. కేకేఆర్ తరపున తొలి మ్యాచ్ ఆడిన మొయిన్ అలీ కట్టుదిట్టంగా బంతులేశాడు.
ఇక మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. పరాగ్ ను బుట్టలో వేసుకున్నాడు. ఓ సిక్సర్ కొట్టిన పరాగ్ అదే ఓవర్లో వరుణ్ చేతికి చిక్కాడు. మూడు సిక్సర్లు కొట్టి పరాగ్ పెవిలియన్ చేరిపోయాడు. ఆ తర్వాతి ఓవర్లోనే జైస్వాల్ ను మొయిన్ అలీ ఔట్ చేయడంతో రాజస్థాన్ కు గట్టిదెబ్బ పడింది. హసరంగ (4) ను వరుణ్, నితీశ్ రాణా (8) ను మొయిన్ అలీ వెనక్కిపంపారు.
జురెల్ పోరాటం
ఇంపాక్ట్ ప్లేయర్ శుభమ్ దూబె (9) ప్రభావం చూపించలేకపోయాడు. అతణ్ని అరోరా ఔట్ చేయడంతో రాజస్థాన్ 15 ఓవర్లకు 110/6తో నిలిచింది. కానీ మరో ఎండ్ లో ధ్రువ్ జురెల్ పోరాటం కొనసాగించాడు. గత మ్యాచ్ లో సన్ రైజర్స్ పై 70 పరుగులు చేసిన జురెల్.. మరోసారి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.
కానీ 28 బంతుల్లో 33 పరుగులు చేసిన జురెల్ ను హర్షిత్ రాణా ఔట్ చేశాడు. అదే ఓవర్లో ప్రమాదకర హెట్ మయర్ (7) నూ పెవిలియన్ చేర్చాడు. చివర్లో ఆర్చర్ రెండు సిక్సర్లు కొట్టడంతో రాజస్థాన్ 150 దాటగలిగింది.
సంబంధిత కథనం