తలా వర్సెస్ కింగ్.. సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ..ఫ్రైడే బ్లాక్ బస్టర్ ను అందించేందుకు చెపాక్ స్టేడియం సిద్ధమైంది. ఐపీఎల్ లోని రెండు టాప్ టీమ్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేడు (మార్చి 28) తలపడుతున్నాయి. ఈ మెగా పోరులో టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ స్టేడియంలో సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్ జరుగుతోంది. ఈ స్టేడియంలో ఆర్సీబీకి చెత్త రికార్డుంది. 2008లో ఈ స్టేడియంలో మ్యాచ్ గెలిచిన కోహ్లి టీమ్.. ఆ తర్వాత 16 సీజన్లలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. చెపాక్ స్టేడియం ఈ రెండు జట్లు 9 మ్యాచ్ లాడాయి. సీఎస్కే 8 గెలవగా.. ఆర్సీబీ ఒకటి మాత్రమే నెగ్గింది. ఇప్పుడు 17 ఏళ్ల వెయిటింగ్ కు ఆర్సీబీ ఎండ్ కార్డు వేస్తుందా? లేదా సీఎస్కే డామినెన్స్ కొనసాగుతుందా? చూడాలి.
చెపాక్ అంటేనే స్పిన్నర్లకు స్వర్గధామం. ఇక్కడ స్పిన్నర్లదే ఆధిపత్యం. ఈ సీజన్ లో ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో సీఎస్కే స్పిన్నర్ నూర్ అహ్మద్ చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ టీమ్ లో అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్ లాంటి స్పిన్నర్లున్నారు. ఆర్సీబీలో కృనాల్ పాండ్య, సుయాష్ శర్మ, లివింగ్ స్టన్ ఉన్నారు.
ఈ ఐపీఎల్ సీజన్ ను సీఎస్కే, ఆర్సీబీ గెలుపుతో మొదలెట్టాయి. చెపాక్ లో ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ ముంబయి 20 ఓవర్లలో 155/9 స్కోరు చేసింది. సీఎస్కే స్పిన్నర్ నూర్ అహ్మద్ 4 వికెట్లతో చెలరేగాడు. ఛేజింగ్ లో సీఎస్కే 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. రచిన్ రవీంద్ర (65 నాటౌట్), రుతురాజ్ (53) బ్యాటింగ్ లో చెలరేగాడు.
మరోవైపు ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభ మ్యాచ్ లోనే డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆర్సీబీ షాకిచ్చింది. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. ఫస్ట్ కేకేఆర్ 174/8 స్కోరు చేసింది. ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్య మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్ లో విరాట్ కోహ్లి (59 నాటౌట్), ఫిల్ సాల్ట్ (56) అదరగొట్టారు.
సంబంధిత కథనం