రేపే ఐపీఎల్ 2025 రీస్టార్ట్.. ఫ్యాన్స్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 6 కీలక విషయాలు.. ఓ లుక్కేయండి-ipl 2025 resume tomorrow may 17th fans should know about these important things play offs points table orange purple cap ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  రేపే ఐపీఎల్ 2025 రీస్టార్ట్.. ఫ్యాన్స్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 6 కీలక విషయాలు.. ఓ లుక్కేయండి

రేపే ఐపీఎల్ 2025 రీస్టార్ట్.. ఫ్యాన్స్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 6 కీలక విషయాలు.. ఓ లుక్కేయండి

ఐపీఎల్ 2025 రీస్టార్ట్ కు సమయం ఆసన్నమవుతోంది. రేపే (మే 17) ఐపీఎల్ 18వ సీజన్ పున:ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ గురించి ఫ్యాన్స్ తెలుసుకోవాల్సిన విషయాలివే. ఓ లుక్కేయండి.

విరాట్ కోహ్లి (PTI)

ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మధ్యలో నిలిచిపోయిన ఐపీఎల్ 2025 సీజన్ తొమ్మిది రోజుల తర్వాత తిరిగి రానుంది. రేపే (మే 17) ఐపీఎల్ 18వ సీజన్ పున:ప్రారంభం కానుంది. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. ఈ నేపథ్యంలో సీజన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.

ఎన్ని మ్యాచ్‌లు మిగిలాయి?

ఐపీఎల్ 2025లో ఇంకా 17 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో 13 లీగ్ మ్యాచ్ లు. ఫైనల్ సహా నాలుగు ప్లేఆఫ్స్ మ్యాచ్ లు. ఫైనల్ జూన్ 3న జరుగుతుంది. జీటీ, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, డీసీ, ఎల్ఎస్జీ, ఎస్ఆర్ హెచ్ మూడేసి మ్యాచ్ లు ఆడనున్నాయి. ఎంఐ, కేకేఆర్, ఆర్ఆర్, సీఎస్కేకు రెండేసి మ్యాచ్ లున్నాయి.

ప్లేఆఫ్స్ రేసు

ఐపీఎల్ 18వ సీజన్ ప్లేఆఫ్స్ రేసు హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటికే సన్ రైజర్స్, రాజస్థాన్, చెన్నై ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఇంకా 7 టీమ్స్ కు అవకాశాలున్నాయి. 5 జట్లు 17 పాయింట్లు సాధించే ఛాన్స్ ఉంది. 16 పాయింట్లతో ఉన్న ఆర్సీబీ, జీటీ మరో విక్టరీ సాధిస్తే ప్లేఆఫ్స్ చేరతాయి. పంజాబ్ (14), ఎంఐ (14), డీసీ (13)కి అవకాశాలూ మెరుగ్గా ఉన్నాయి. కేకేఆర్ (11), లక్నో (10) ఆశలు ప్రమాదంలో ఉన్నాయి.

కీలకమైన మ్యాచ్‌లు

ముంబయి ఇండియన్స్ ప్రస్తుతం 14 పాయింట్లతో ఉంది. కానీ రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మే 21న ఢిల్లీని, మే 26న పంజాబ్ ను ముంబయి ఢీకొంటుంది. డీసీకి మరోవైపు కఠినమైన మ్యాచ్‌లు ఉన్నాయి. మొదట టాప్ జట్టు జీటీతో, చివరగా పంజాబ్‌తో మ్యాచ్ ఉంది. ఈ జట్లలో ప్రతి ఒక్కటీ మిగిలిన రెండు మ్యాచ్ ల్లో గెలవాల్సి ఉంది. అందుకే ఈ మ్యాచ్ లు హోరాహోరీగా సాగనున్నాయి.

ఆరెంజ్ క్యాప్

ఆరెంజ్ క్యాప్ రేస్‌లో టాప్ ఐదుగురు ఆటగాళ్ల మధ్య 10 పరుగుల తేడా మాత్రమే ఉంది. సూర్యకుమార్ యాదవ్ (510), సాయి సుదర్శన్ (509), శుభ్ మన్ గిల్ (508), విరాట్ కోహ్లి (505), బట్లర్ (500) టాప్-5లో వరుసగా ఉన్నారు. మరి వీళ్లలో అత్యధిక పరుగుల వీరుడిగా ఎవరు నిలుస్తారో చూడాలి.

పర్పుల్ క్యాప్

పర్పుల్ క్యాప్ రేసు కూడా రసవత్తరంగా సాగుతోంది. టాప్-5 బౌలర్ల మధ్య తేడా 3 వికెట్లే. ప్రసిద్ధ్ క్రిష్ణ (20), నూర్ అహ్మద్ (20), హేజిల్ వుడ్ (18), బౌల్ట్ (18), వరుణ్ చక్రవర్తి (17) వరుసగా తొలి అయిదు స్థానాల్లో ఉన్నారు. వికెట్ల వీరుడిగా నిలిచేందుకు పోటీ టఫ్ గానే ఉంది. చూడాలి ఎవరికి పర్పుల్ క్యాప్ దక్కుతుందో?

ఆరు స్టేడియాల్లోనే

భద్రతా కారణాలు, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సీజన్ లో మిగిలిన లీగ్ మ్యాచ్ లను ఆరు నగరాల్లోని స్టేడియాల్లోనే నిర్వహిస్తున్నారు. బెంగళూరు, జైపుర్, ఢిల్లీ, లక్నో, ముంబయి, అహ్మదాబాద్ లో మ్యాచ్ లు జరుగుతాయి. ఇంకా ప్లేఆఫ్స్, ఫైనల్ వేదికలను ఖరారు చేయలేదు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం