ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అర్ధంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2025 మళ్లీ శనివారం (మే 17) నుంచి ప్రారంభం కాబోతోంది. ఆ రోజు ఆర్సీబీ, కేకేఆర్ మధ్య బెంగళూరులో మ్యాచ్ జరగనుంది. ఇక లీగ్ ఫైనల్ జూన్ 3న జరగబోతోంది. ఈ కొత్త షెడ్యూల్ ను బీసీసీఐ సోమవారం (మే 12) అనౌన్స్ చేసింది.
ఐపీఎల్ ను గతవారం అర్ధంతరంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇండియా, పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో పరిస్థితులు మెల్లగా కుదుట పడుతున్నాయి. దీంతో శనివారం (మే 17) నుంచి లీగ్ ను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది.
కొత్త షెడ్యూల్ ప్రకారం క్వాలిఫయర్ 2, ఎలిమినేటర్ మే 29, 30 తేదీల్లో జరగనుంది. ఇక క్వాలిఫయర్ 1 జూన్ 1న జరగనుండగా.. జూన్ 3న ఫైనల్ జరుగుతుంది. మే 27న చివరి లీగ్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్ లో లక్నో, బెంగళూరు మధ్య ఏకనా స్టేడియంలో జరగనుంది.
ఐపీఎల్ 2025లో మిగిలిన లీగ్ మ్యాచ్ లు ఆరు వేదికల్లో జరగనున్నాయి. లక్నో, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, జైపూర్ లలో ఈ మ్యాచ్ లు జరుగుతాయి. దీంతో హైదరాబాద్ లో ఈ సీజన్ ఐపీఎల్ ఇక ముగిసినట్లే. సన్ రైజర్స్ హైదరాబాద్ తన మిగిలిన మూడు లీగ్ మ్యాచ్ లను లక్నో, బెంగళూరు, ఢిల్లీలో ఆడనుంది.
ప్లేఆఫ్స్ లో రెండు మ్యాచ్ లు నిజానికి మన దగ్గరే జరగాల్సి ఉంది. కానీ కొత్త షెడ్యూల్లో ప్లేఆఫ్స్ వేదికలను ఇంకా ప్రకటించలేదు. అర్ధంతరంగా మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయిన పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ ను మరోసారి నిర్వహించబోతున్నారు. ఈ మ్యాచ్ మే 24న జైపూర్ లో జరుగుతుంది.
మొత్తంగా మరో 17 మ్యాచ్ లు జరిగితే ఐపీఎల్ 2025 ముగుస్తుంది. ఈ కొత్త షెడ్యూల్లో రెండు డబుల్ హెడర్స్ ఉన్నాయి. అవి రెండూ ఆదివారాలే జరుగుతాయి. ప్రభుత్వం, సెక్యూరిటీ ఏజెన్సీలు, అన్ని ఫ్రాంఛైజీలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
సంబంధిత కథనం