ఇండియా, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా వారం పాటు వాయిదాపడిన ఐపీఎల్ శనివారం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతోన్న మ్యాచ్ తో తిరిగి మొదలుకాబోతుంది. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం బెంగళూరులో భారీగా వర్షం కురుస్తుండంతో చిన్నస్వామి స్టేడియం జలమయమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.
ఈ మ్యాచ్‌కు కోహ్లి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవనున్నాడు. ఇటీవలే కోహ్లి టెస్ట్‌లకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. రిటైర్‌మెంట్ తర్వాత అతడు ఆడనున్న మొదటి మ్యాచ్ ఇది. అతడిని ఘనంగా వీడ్కోలు పలకాలని అభిమానులు భారీగానే ప్లాన్స్ చేశారు.
కోహ్లి పేర్లతో ఉన్న వైట్ జర్సీలు ధరించిన స్టేడియానికి తరలివచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. వర్షం కారణంగా కోహ్లి ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలేలా కనిపిస్తోంది. .
ఈ మ్యాచ్‌లో కోల్‌కతాపై విజయం సాధిస్తే బెంగళూరు నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచుల్లో ఎనిమిది విజయాలతో ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ బెంగళూరు రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ప్లేఅఫ్స్ చేరుకోవడమే కాకుండా ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లోనూ టాప్‌లోకి దూసుకెళుతుంది.
మరోవైపు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే కోల్‌కతా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా కేవలం అయిదింటిలోనే విజయాన్ని సాధించింది.
పాకిస్థాన్ దాడులు చేసే అవకాశం ఉందని ప్రచారం జరగడంతో క్రికెటర్ల భద్రతా దృష్ట్యా ఐపీఎల్‌ను అర్థాంతరంగా వాయిదా వేసింది బీసీసీఐ. ఢీల్లీ, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోండగా మధ్యలోనే నిలిపివేసి అభిమానులను బయటకు పంపించారు. యుద్ధ భయాలు తొలగిపోవడంతో శనివారం నుంచి ఐపీఎల్‌ను పునఃప్రారంభం కాబోతుంది.
సంబంధిత కథనం