ఐపీఎల్ 2025 లో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్ ఆశలకు గండిపడింది. శనివారం బెంగళూరు రాయల్స్ ఛాలెంజర్స్‌తో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో కోల్‌కతా ఇంటి ముఖం పట్టడం ఖాయమైంది. మరోవైపు ఈ మ్యాచ్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా బెంగళూరు ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది.
ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఐపీఎల్‌ను తొమ్మిది రోజుల పాటు వాయిదా వేసింది బీసీసీఐ. శనివారం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌తో ఈ లీగ్ పునః ప్రారంభం కావాల్సివుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ టాస్ పడకుండానే రద్ధయింది. ఓవర్లు కుదించి మ్యాచ్‌ను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఎడతెరపి లేకుండా వర్షం పడటంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. దాంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్టకు తలో పాయింట్ దక్కింది. పన్నెండు మ్యాచుల్లో ఎనిమిది విజయాలు సాధించిన ఆర్‌సీబీ పదిహేడు పాయింట్లతో పాయింట్స్‌తో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. గుజరాత్ టైటాన్స్‌ను వెనక్కినెట్టి పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌కు దూసుకుపోయింది. మరోవైపు 12 మ్యాచుల్లో ఐదు విజయాలు, ఆరు ఓటములతో 12 పాయింట్లు సాధించిన కోల్‌కతా ఆరో స్థానంలో ఉంది. మరోవైపు తన చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్‌తో కోల్‌కతా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా కూడా కోల్‌కతా ప్లేఆఫ్స్ చేరే అవకాశం లేదు.
ఆర్‌సీబీ కూడా మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సివుంది. తన తదుపరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఆర్‌సీబీ ఢీకొట్టబోతుంది. మే 23న ఈ మ్యాచ్ జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మే 27న మరో మ్యాచ్ లో ఆర్‌సీబీ తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా, ఓడిన ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ బెర్తుకు ఎలాంటి ఢోకా లేదు.
సంబంధిత కథనం