ఐపీఎల్ 2025 సీజన్ తొలి మూడు మ్యాచ్ లకు రాజస్థాన్ రాయల్స్ తమ కెప్టెన్ గా రియాన్ పరాగ్ పేరుకు ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ ఇంకా ఫుల్ ఫిట్ నెస్ సాధించలేదు. దీంతో ఈ మూడు మ్యాచ్ లకు శాంసన్ కేవలం బ్యాటర్ గానే ఆడతాడు. అందుకే ఆల్ రౌండర్ పరాగ్ ను కెప్టెన్ గా అనౌన్స్ చేశారు. అయితే ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు కారణమైంది. యశస్వి జైస్వాల్ కు అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
రాజస్థాన్ రాయల్స్ తాత్కాలిక కెప్టెన్ గా రియాన్ పరాగ్ కు ఎంపిక చేయడంపై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో భగ్గుమంటున్నారు. ఎంతో టాలెంటెడ్ బ్యాటర్, రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆటగాడు జైస్వాల్ ను పక్కనపెట్టడంపై ప్రశ్నిస్తున్నారు. పరాగ్ ఏం సాధించాడని కెప్టెన్ గా అనౌన్స్ చేశారని మండిపడుతున్నారు. జైస్వాల్ కెరీర్ ను నాశనం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు.
రాజస్థాన్ రాయల్స్ తోనే ఐపీఎల్ కెరీర్ స్టార్ట్ చేసిన పరాగ్ ఇప్పటివరకూ 6 సీజన్లలో 70 మ్యాచ్ ల్లో 24.43 సగటుతో 1173 పరుగులే చేశాడు. స్పిన్నర్ కూడా అయిన పరాగ్ 21 ఇన్నింగ్స్ ల్లో బౌలింగ్ చేసి 4 వికెట్లే పడగొట్టాడు. గత సీజన్ లో మాత్రమే 52 సగటుతో 573 పరుగులు చేసి కాస్త ఆకట్టుకున్నాడు. అదే జైస్వాల్ అయితే స్టార్ బ్యాటర్ గా ఎదిగాడు. అయిదు సీజన్లలో రాజస్థాన్ తరపున 52 ఇన్నింగ్స్ ల్లో 32.14 సగటుతో 1607 పరుగులు చేశాడు. రెండు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు బాదాడు.
2019 నుంచి ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉన్నా.. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపునా రియాన్ పరాగ్ ను కొనసాగించేందుకు నెపోటిజమే కారణమనే విమర్శలు వస్తున్నాయి. రియాన్ తండ్రి పరాగ్ దాస్ ఒకప్పటి ఫస్ట్ క్లాస్ క్రికెటర్. అస్సాం క్రికెట్లో చక్రం తిప్పుతున్నాడని పరాగ్ దాస్ పై ఆరోపణలు వస్తున్నాయి. పైగా ఈ సీజన్లో రాజస్థాన్ అస్సాంలోని గువహాటిలో రెండు మ్యాచ్ లు ఆడబోతోంది. అందుకే పరాగ్ ను కెప్టెన్ గా అనౌన్స్ చేశారనే విమర్శలు వస్తున్నాయి.
ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ శాంసన్ కుడి చూపుడు వేలుకు గాయమైంది. దీనికి సర్జరీ చేయించుకున్నాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రీహాబిలిటేషన్ లో కోలుకున్నాడు. అతను బ్యాటింగ్ చేయడానికి అనుమతి పొందినప్పటికీ, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోని వైద్య బృందం మాత్రం వికెట్ కీపింగ్ చేయొద్దని చెప్పింది. కాబట్టి శాంసన్ మొదటి కొన్ని మ్యాచ్‌లలో ఇంపాక్ట్ సబ్‌గా ఆడే అవకాశం ఉంది. ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు.
సంబంధిత కథనం