ఐపీఎల్ 2025లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్ లో బోణీ కొట్టేందుకు మంగళవారం (మార్చి 25) పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఢీ కొడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అహ్మదాబాద్ లోని క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కు దిగనుంది.
శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ విజయంతో ఐపీఎల్ 2025ను స్టార్ట్ చేయాలనే టార్గెట్ తో బరిలో దిగుతోంది. సొంతగడ్డపై మంగళవారం పంజాబ్ కింగ్స్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడుతోంది. మంచు ప్రభావం నేపథ్యంలో టాస్ గెలిచిన శుభ్ మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
హైదరాబాద్ పేసర్ సిరాజ్ ఈ సీజన్ లో గుజరాత్ జెయింట్స్ కు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఏడేళ్లుగా ఆర్సీబీకి ఆడిన సిరాజ్ ను ఈ సీజన్ కు ముందు ఆ టీమ్ వదులుకున్న సంగతి తెలిసిందే. ఆ టీమ్ లో సిరాజ్ తో పాటు రబాడ, ప్రసిద్ధ్ తో పేస్ విభాగం బలంగానే ఉంది.
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ ను కొత్త కెప్టెన్ నడిపించబోతున్నాడు. గతేడాది కేకేఆర్ ను విజేతగా నిలిపిన శ్రేయస్ అయ్యర్.. ఈ సీజన్ లో పంజాబ్ కెప్టెన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో కొత్తగా సిద్ధమైన పంజాబ్.. తొలి మ్యాచ్ నుంచే తమదైన ముద్ర వేయాలనే లక్ష్యంతో ఉంది.
పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండ్ల తో పటిష్ఠంగా కనిపిస్తోంది. స్టాయినిస్, మ్యాక్స్ వెల్, అజ్మతుల్లా ఒమర్ జాయ్, మార్కో యాన్సెన్ లాంటి ఆల్ రౌండర్లు ఈ మ్యాచ్ లో ఆడుతున్నారు.
సంబంధిత కథనం