లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ నికోలస్ పూరన్ (26 బంతుల్లో 70) చెలరేగిపోయాడు. గురువారం (మార్చి 27) ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఎప్పుడూ ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేసే సన్‌రైజర్స్.. ఈ మ్యాచ్ లో పూరన్ దంచుడుకు బలైపోయింది. అతను 6 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. తన తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన లక్నో.. ఈ విజయంతో సీజన్ లో బోణీ కొట్టింది. 5 వికెట్ల తేడాతో గెలిచింది.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 స్కోరు చేసింది. హెడ్ (28 బంతుల్లో 47) టాప్ స్కోరర్. శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్లు కోల్పోయి 16.1 ఓవర్లలోనే టార్గెట్ రీచ్ అయింది. పూరన్ తో పాటు మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 52) కూడా రాణించాడు.
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఛేజింగ్ లో ఎల్ఎస్జీ బ్యాటర్ నికోలస్ పూరన్ పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. సన్‌రైజర్స్ పైనే కౌంటర్ అటాక్ కు దిగాడు. సిక్సర్లు, ఫోర్లతో ఉప్పల్ స్టేడియాన్ని ఉపేశాడు. ఛేజింగ్ లో లక్నో 2 ఓవర్లకు 14/1తో నిలిచింది. కానీ ఆ తర్వాతి ఓవర్ నుంచే పూరన్ విధ్వంసం మొదలైంది.
సిమర్జీత్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సర్లతో పూరన్ అరాచకం మొదలైంది. షమి ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన అతను.. అభిషేక్ శర్మకూ అదే శిక్ష వేశాడు. 6 ఓవర్లే టీమ్ 77/1తో నిలిచింది. ఆ తర్వాతి ఓవర్లోనే జంపా బౌలింగ్ సిక్సర్ తో 18 బాల్స్ లోనే పూరన్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు.
మరోవైపు మిచెల్ మార్ష్ కూడా రాణించాడు. పూరన్, మార్ష్ జోడీ 41 బాల్స్ లోనే 100 పార్ట్‌నర్‌షిప్ నమోదు చేసింది. 8వ ఓవర్లోనే లక్నో స్కోర్ 100 దాటింది. పూరన్ విధ్వంసానికి కమిన్స్ తెరదించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పూరన్ ఔటైనా మార్ష్ బాదుడు కొనసాగించాడు. ఫిఫ్టీ తర్వాత మార్ష్ ను కూడా కమిన్స్ ఔట్ చేశాడు.
బదోని (6), పంత్ (15)ను ఔట్ చేసిన సన్‌రైజర్స్ మ్యాచ్ ను మలుపు తిప్పేందుకు ప్రయత్నించింది. కానీ గత సీజన్ వరకు సన్‌రైజర్స్ కు ఆడి.. ఇప్పుడు లక్నో జట్టులో ఉన్న సమద్ భారీ షాట్లతో చెలరేగాడు. 8 బంతుల్లోనే 22 పరుగులతో నాటౌట్ గా నిలిచిన సమద్.. 2 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. ఎప్పుడూ వికెట్ కీపర్ బ్యాటర్ గానే కనిపించే ఇషాన్ కిషన్ బౌలింగ్ చేయడం గమనార్హం. అతను వేసిన తొలి బంతికే మిల్లర్ (13 నాటౌట్) ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించాడు.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలోనే శార్దూల్ ఠాకూర్ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ప్రమాదకర అభిషేక్ శర్మ (6), గత మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ (0)ను వరుస బంతుల్లో ఔట్ చేశాడు.
రెండు వికెట్లు కోల్పోయినా హెడ్ బాదుడుతో సన్‌రైజర్స్ జోరందుకుంది. పవర్ ప్లే లో సన్‌రైజర్స్ 62/2తో నిలిచింది. కానీ అరంగేట్ర పేసర్ ప్రిన్స్ యాదవ్.. హెడ్ వికెట్లను లేపేశాడు. 28 బంతులాడిన హెడ్ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు.
2 సిక్సర్లు, ఓ ఫోర్ బాదిన క్లాసెన్ (17 బంతుల్లో 26) ను బ్యాడ్ లక్ వెంటాడింది. స్ట్రెయిట్ డ్రైైవ్ ఆడిన నితీశ్ క్యాచ్ పేసర్ ప్రిన్స్ యాదవ్ చేతుల్లో నుంచి వెళ్లి నాన్ స్ట్రైకర్ ఎండ్ లో స్టంప్స్ ను లేపేసింది. వైజాగ్ కుర్రాడు నితీశ్ కుమార్ (28 బంతుల్లో 32) వేగంగా ఆడలేకపోయాడు. అతణ్ని స్పిన్నర్ రవి బిష్ణోయ్ బోల్తా కొట్టించాడు.
128/5తో సన్‌రైజర్స్ కష్టాల్లో పడ్డ సమయంలో యంగ్ బ్యాటర్ అనికేత్ వర్మ పేలాడు. 13 బంతుల్లోనే 36 పరుగులు చేశాడు. ఏకంగా 5 సిక్సర్లు బాదాడు. కెప్టెన్ కమిన్స్ కూడా సిక్సర్లతో రెచ్చిపోయాడు. కానీ చివరకు 200 చేయకుండానే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగించింది.
సంబంధిత కథనం