ఐపీఎల్ 2025 లో కొత్త రూల్స్ అమలు కాబోతున్నాయి. బంతిపై ఆటగాళ్లు ఉమ్మి రాస్తే ఇకపై ఫైన్ ఉండదు. బంతిపై ఉమ్మి రాయడంపై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ ఎత్తేసేంది. అలాగే మ్యాచ్ లో మంచు ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయోగానికి సిద్ధమైంది. మ్యాచ్ లో సెకండ్ బాల్ ఇచ్చే రూల్ ను తీసుకొచ్చింది. గురువారం (మార్చి 20) ఐపీఎల్ 10 ఫ్రాంఛైజీల కెప్టెన్లు, మేనేజర్లతో మీటింగ్ లో బీసీసీఐ ఈ విషయాలు వెల్లడించింది.
బంతిని మెరుపు తగ్గిన తర్వాత స్వింగ్, రివర్స్ స్వింగ్ రాబట్టేందుకు వీలుగా బాల్ పై ఉమ్మి రాసేవాళ్లు. బౌలర్లు, ఆటగాళ్లు బంతిపై సలీవా (ఉమ్మి) అంటించి రుద్దేవాళ్లు. కానీ కరోనా టైమ్ లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా సోకే ప్రమాదం ఉంది కాబట్టి బంతిపై ఉమ్మి రాయడాన్ని 2020 మేలో ఐసీసీ బ్యాన్ చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడినప్పుడు షమి ఐసీసీకి ఓ రిక్వెస్ట్ చేశాడు. బౌలర్లకు బెనిఫిట్ ఉండేలా బంతిపై ఉమ్మి రాసేందుకు అనుమతించాలని రిక్వెస్ట్ చేశాడు. షమికి మాజీ పేసర్లు ఫిలాండర్, సౌథీ లాంటి వాళ్లు మద్దుతుగా కామెంట్లు చేశారు. ఇప్పుడు కెప్టెన్ మీటింగ్ లో అన్ని ఫ్రాంఛైజీల సారథులు ఏకపక్షంగా ఒప్పుకోవడంతో ఉమ్మి రాయడంపై నిషేధాన్ని బీసీసీఐ ఎత్తేసింది.
ఐపీఎల్ లో ఇప్పుడు ఇన్నింగ్స్ కు ఒకటి చొప్పున రెండు బాల్స్ వాడుతున్నారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో మంచు ఎఫెక్ట్ కారణంగా బంతిపై బౌలర్లకు పట్టు చిక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో ఛేజింగ్ టీమ్ కు అడ్వాంటేజీ ఉంటుంది. అందుకే టాస్ గెలిచిన కెప్టెన్లు ఎక్కువగా బౌలింగ్ ఎంచుకుంటారు.
ఈ అడ్వాంటేజీని తగ్గించేందుకు బీసీసీఐ మరో రూల్ తీసుకొచ్చింది. ఐపీఎల్ మ్యాచ్ ల్లో సెకండ్ ఇన్నింగ్స్ లో సెకండ్ న్యూ బాల్ ను వాడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. ఛేజింగ్ లో సెకండ్ బాల్ ఇవ్వాలా? వద్దా? అనేది అంపైర్ల చేతుల్లోనే ఉంటుంది.
డ్యూ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది అని అంపైర్లు అనుకుంటే కెప్టెన్ రిక్వెస్ట్ తో న్యూ బాల్ ఇస్తారు. అది కూడా ఛేజింగ్ లో 11వ ఓవర్ ముగిసిన తర్వాతే. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం మ్యాచ్ ల్లో సెకండ్ న్యూ బాల్ వాడే ఛాన్స్ రాకపోవచ్చు.
సంబంధిత కథనం