ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను విజేతగా నిలిపిన కెప్టెన్ రోహిత్ మ్యాన్ జోరుమీదున్నాడు. ఐపీఎల్ 2025 కు ఫుల్ జోష్ తో రెడీ అయ్యాడు. ఆదివారం (మార్చి 23) రాత్రి 7.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ తో ముంబయి ఐపీఎల్ టైటిల్ వేటను మొదలెట్టనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు రోహిత్ స్పెషల్ బ్యాటింగ్ గ్లవ్స్ వైరల్ గా మారాయి.
గ్రౌండ్ లో దిగితే అగ్రెసివ్ బ్యాటింగ్ తో అదరగొట్టే రోహిత్.. బయట మాత్రం ఫ్యామిలీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నాడు. సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో గడిపేస్తాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత.. ఐపీఎల్ 2025 స్టార్టింగ్ కు ముందు దొరికిన ఖాళీ టైమ్ లో ఫ్యామిలీతో కలిసి రోహిత్ మాల్దీవ్స్ వెకేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఐపీఎల్ 2025 కోసం రెడీ అవుతున్న రోహిత్ బ్యాటింగ్ గ్లవ్స్ వైరల్ గా మారాయి. వీటిపై ‘ఎస్ఏఆర్’ అనే పదాన్ని ముద్రించుకున్నాడు. దీని అర్థం తెలుసుకుంటున్న ఫ్యాన్స్.. ఫ్యామిలీపై రోహిత్ లవ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రోహిత్ గ్లవ్స్ పై ఉన్న ‘ఎస్ఏఆర్’కు అర్థం.. ఎస్ అంటే సమైరా, ఏ అంటే అహాన్, ఆర్ అంటే రితిక.
తన కొత్త బ్యాటింగ్ గ్లవ్స్ పై రోహిత్.. భార్యాపిల్లల పేర్లు తెలిసేలా కోడ్ ముంద్రించుకున్నాడు. రోహిత్ భార్య పేరు రితిక అన్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు మొదట కూతురు సమైరా జన్మించింది. గతేడాది చివర్లో రితిక కొడుకు అహాన్ కు జన్మనిచ్చింది. ఇటీవల సోషల్ మీడియాలో ముంబయి ఇండియన్స్ పోస్టు చేసిన వీడియోలో రోహిత్ గ్లవ్స్ పై ఉన్న ‘ఎస్ఏఆర్’ అనే వర్డ్ వైరల్ గా మారింది.
అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. అన్ని ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్ చేరిన తొలి కెప్టెన్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు. 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్, 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్, 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా ఆడింది. టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ గెలిచింది. ప్రస్తుతం తన టీ20 కెరీర్ చివరి దశలో ఉన్న రోహిత్ ఈ మధ్య షాట్లు ఆడేటప్పుడు ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నాడు.
సంబంధిత కథనం