IPL 2025 MI vs DC: కరుణ్ చెలరేగినా.. తిప్పేసిన కర్ణ్.. చివర్లో మూడు రనౌట్లు.. ఢిల్లీకి ఫస్ట్ ఓటమి-ipl 2025 mi vs dc karun nair sensational knock goes vain delhi capitals fists defeat 3 consecutive run outs karn sharma ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2025 Mi Vs Dc: కరుణ్ చెలరేగినా.. తిప్పేసిన కర్ణ్.. చివర్లో మూడు రనౌట్లు.. ఢిల్లీకి ఫస్ట్ ఓటమి

IPL 2025 MI vs DC: కరుణ్ చెలరేగినా.. తిప్పేసిన కర్ణ్.. చివర్లో మూడు రనౌట్లు.. ఢిల్లీకి ఫస్ట్ ఓటమి

IPL 2025 MI vs DC: వాట్ ఏ థ్రిల్లర్. 2022 తర్వాత తిరిగి ఐపీఎల్ లో ఆడిన కరుణ్ నాయర్ సెన్షేషనల్ బ్యాటింగ్ తో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచేలా కనిపించింది. కానీ ముంబయి ఇండియన్స్ స్పిన్నర్ కర్ణ్ శర్మ 3 వికెట్లతో తిప్పేశాడు. ఆఖర్లో డ్రామా నెలకొనగా.. ముంబయి ఇండియన్స్ కే గెలుపు దక్కింది.

ఢిల్లీని దెబ్బకొట్టిన కర్ణ్ శర్మ (AFP)

ఐపీఎల్ 2025లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్. ఇంపాక్ట్ ప్లేయర్ గా క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్ చెలరేగిపోయాడు. 40 బంతుల్లో 89 పరుగులు చేశాడు. 12 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. కానీ ముంబయి ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడిన స్పిన్నర్ కర్ణ్ శర్మ 3 వికెట్లతో దెబ్బకొట్టాడు. ఆఖర్లో మూడు రనౌట్లతో ముంబయి ఇండియన్స్ గెలిచింది. ఆదివారం (ఏప్రిల్ 13) ఆ టీమ్ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది.

ఛేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబయి 205/5 స్కోరు చేసింది. హోం గ్రౌండ్ లో ఓడిన ఢిల్లీకి ఐపీఎల్ 2025లో ఇదే ఫస్ట్ పరాజయం. ముంబయికి రెండో గెలుపు.

కరుణ్ విధ్వంసం

ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ తో ఛేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బాల్ కే జేక్ ఫ్రేజర్ (0) వికెట్ కోల్పోయింది. కానీ ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన కరుణ్ నాయర్ మెరుపులతో అరుణ్ జైట్లీ స్టేడియం ఊగిపోయింది. మూడేళ్ల తర్వాత తిరిగి ఐపీఎల్ లో ఆడిన కరుణ్ ప్రతి బంతికి బౌండరీ బాదాలనే కసితో కనిపించాడు.

బుమ్రా బౌలింగ్ లోనూ

డేంజరస్ పేసర్లు బౌల్ట్, బుమ్రాను కూడా కరుణ్ వదల్లేదు. బుమ్రా వేసిన ఆరో ఓవర్లో రెండు సిక్సర్లు, ఫోర్ కొట్టిన అతను 22 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఏడేళ్లలో అతనికి ఇదే తొలి ఐపీఎల్ ఫిఫ్టీ. దేశవాళీ సీజన్లో అద్భుత ఫామ్ ను ఈ మ్యాచ్ లోనూ కొనసాగిస్తూ ముంబయి బౌలింగ్ ను ఊచకోత కోశాడు. సింగిల్ తీయడం కంటే ఫోర్లు, సిక్సర్లు కొట్టడమే ఈజీ అన్నట్లు బ్యాటింగ్ చేశాడు. మరో ఎండ్ లో కాసేపు సపోర్ట్ ఇచ్చిన అభిషేక్ పోరెల్ (33) ఔటైపోయాడు.

ఆ వికెట్ తో

సెంచరీ దిశగా సాగుతున్న కరుణ్ ను శాంట్నర్ అద్భుతమైన బంతితో బౌల్డ్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కథ అడ్డం తిరిగింది. 40 బంతుల్లో 89 పరుగులు చేసిన కరుణ్.. 12 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. కరుణ్ వికెట్ తో మ్యాచ్ పై ముంబయి పట్టు సాధించింది. 12 ఓవర్లకు డీసీ 140/3తో నిలవడం.. సమీకరణం 8 ఓవర్లలో 66 పరుగులుగా ఉండటంతో ఆ టీమ్ గెలుస్తుందనే అనిపించింది.

శర్మ మ్యాజిక్

స్పిన్నర్ కర్ణ్ శర్మ మ్యాచ్ ను ముంబయి వైపు తిప్పే ప్రయత్నం చేశాడు. వరుస ఓవర్లలో స్టబ్స్ (1)తో పాటు ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ (15) వికెట్లు సాధించాడు. సమీకరణం 18 బంతుల్లో 39 పరుగులుగా మారడంతో ఉత్కంఠ రేగింది. కానీ యంగ్ ఆల్ రౌండర్ విప్రజ్.. శాంట్నర్ వేసిన 18వ ఓవర్లో తొలి రెండు బంతులకు 6, 4 కొట్టడంతో డ్రామా మరింత రసవత్తరంగా మారింది. కానీ అదే ఓవర్లో విప్రజ్ ఔటైపోయాడు.

మూడు రనౌట్లు

వైజాగ్ లో లక్నో పై ఢిల్లీకి సంచలన విజయాన్ని అందించిన అశుతోష్ శర్మ మరోసారి టీమ్ ను గెలిపించేలా కనిపించాడు. ఢిల్లీ విజయానికి 12 బంతుల్లో 23 పరుగులు అవసరమవగా.. బుమ్రా బౌలింగ్ లో అశుతోష్ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. కానీ తర్వాతి మూడు బంతులకు వరుసగా అశుతోష్, కుల్ దీప్, మోహిత్ రనౌట్ కావడంతో ఢిల్లీ ఆలౌటైంది. థ్రిల్లింగ్ మ్యాచ్ లో ముంబయికే గెలుపు దక్కింది.

తిలక్ అదుర్స్

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (33 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు.

రికిల్టన్ (25 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ (28 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), నమన్ ధీర్ (17 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా అదరగొట్టారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్, కుల్ దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం