IPL 2025: విశాఖ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్.. వైజాగ్ స్టేడియంలో మళ్లీ ఐపీఎల్ మ్యాచ్ లు!
IPL 2025: ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా వైజాగ్ క్రికెట్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్. విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో మరోసారి ఐపీఎల్ మ్యాచ్ లు జరిగే అవకాశముంది. ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ హోమ్ గ్రౌండ్ గా ఎంచుకున్న ఈ స్టేడియంలో ఆ జట్టు రెండు మ్యాచ్ లాడే ఛాన్స్ ఉంది.

మరోసారి వైజాగ్ క్రికెట్ లవర్స్ కు ఐపీఎల్ మ్యాచ్ లను ప్రత్యక్షంగా తిలకించే అవకాశం రాబోతుందని సమాచారం. ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ వీడీసీఏ క్రికెట్ మైదానాన్ని తమ రెండో హోం గ్రౌండ్ గా ఎంచుకోబోతోందని క్రిక్ బజ్ తన రిపోర్ట్ లో తెలిపింది. 2024 ఐపీఎల్ సీజన్ లోనూ వైజాగ్ స్టేడియంలో రెండు మ్యాచ్ లు జరిగిన సంగతి తెలిసిందే.
తొలి రెండు మ్యాచ్ లు
క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2025లో తన తొలి రెండు మ్యాచ్ లను విశాఖలో ఆడబోతోంది. అక్కడి అభిమానులను మరోసారి ఉర్రూతలూగించేందుకు ఈ ఫ్రాంఛైజీ సిద్ధమవుతోంది. కానీ దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
గత ఐపీఎల్ సీజన్ లో ఈ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మ్యాచ్ లు ఆడింది. అప్పుడు డబ్ల్యూపీఎల్ మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చిన ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లకు సిద్ధం కాకపోవడంతో ఆ ఫ్రాంఛైజీ వైజాగ్ ను ఎంచుకుంది.
పరుగుల పండుగ
ఐపీఎల్ 2024లో వైజాగ్ స్టేడియంలో జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ పరుగుల వరద పారింది. తొలి మ్యాచ్ లో ఢిల్లీపై కేకేఆర్ ఏకంగా 272/7 స్కోరు చేసింది. ఛేజింగ్ లో 166 కే కుప్పకూలిన ఢిల్లీ ఓటమి పాలైంది. రెండో మ్యాచ్ లో మొదట ఢిల్లీ 191/5 స్కోరు సాధించింది. అనంతరం సీఎస్కే ను 171/6కే కట్టడి చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సారి వైజాగ్ ను రెండో హోం గ్రౌండ్ గా ఢిల్లీ ఎందుకు ఎంచుకుంటుందనే దానికి రీజన్ క్లారిటీగా తెలియదు. కానీ వైజాగ్ లో ఐపీఎల్ మ్యాచ్ లు జరిగితే అటు ఎంటర్ టైన్ మెంట్ తో పాటు పేరు పరంగానూ వైజాగ్, ఆంధ్రప్రదేశ్ కు కలిసొచ్చే అవకాశముంది.
సంబంధిత కథనం