చెలరేగిన మార్ష్, మార్ క్రమ్.. చావోరేవో మ్యాచ్ లో లక్నో భారీ స్కోరు.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే?-ipl 2025 lsg vs srh mitchell marsh and markram fiery knock gives lucknow super giants big total pooran eshan harsh dubey ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  చెలరేగిన మార్ష్, మార్ క్రమ్.. చావోరేవో మ్యాచ్ లో లక్నో భారీ స్కోరు.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే?

చెలరేగిన మార్ష్, మార్ క్రమ్.. చావోరేవో మ్యాచ్ లో లక్నో భారీ స్కోరు.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2025లో డూ ఆర్ డై మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ లో ఆరంభంలో అదరగొట్టి.. ఆఖర్లో కాస్త తడబడింది. అయినా భారీ స్కోరుతోనే ఇన్నింగ్స్ ముగించింది. మరి ఈ టార్గెట్ కాపాడుకుంటుందా? ఓడి ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమిస్తుందా? చూడాలి.

సత్తాచాటిన మార్ క్రమ్, మిచెల్ మార్ష్

ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్ ఆశలు నిలవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ లో అదరగొట్టింది. భారీ స్కోరు సాధించింది. సోమవారం (మే 19) లక్నో స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ను చిత్తుచేసింది.

20 ఓవర్లలో లక్నో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (39 బంతుల్లో 65; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), మార్ క్రమ్ (38 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), పూరన్ (26 బంతుల్లో 45; 6 ఫోర్లు, ఓ సిక్సర్) అదరగొట్టారు. 4 ఓవర్లు వేసిన ఇషాన్ మలింగ 28 రన్స్ మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

ఓపెనర్లు అదుర్స్

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ కు అదిరే ఆరంభం దక్కింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, మార్ క్రమ్ మరోసారి రెచ్చిపోయారు. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ కు ఫోర్ తో మార్ష్ దంచుడు మొదలెట్టాడు. ఓ ఎండ్ లో మార్ష్, మరో ఎండ్ లో మార్ క్రమ్ బౌండరీల మోత మోగించారు.

దంచుడే దంచుడు

ఐపీఎల్ అరంగేట్ర పేసర్ హర్ష్ దూబె బౌలింగ్ లో మార్ష్, మార్ క్రమ్ చెలరేగిపోయారు. ఫోర్లు, సిక్సర్లు రాబట్టారు. పవర్ ప్లేలో ఆ టీమ్ 69/0తో నిలిచింది. 28 బంతుల్లో మార్ష్ ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో అతనికి ఇది అయిదో హాఫ్ సెంచరీ.

పంత్ ఫెయిల్

మార్ష్, మార్ క్రమ్ దూకుడుతో లక్నో 10 ఓవర్లకే 108 పరుగులు చేసింది. కానీ ఆ వెంటనే మార్ష్ ను హర్ష్ దూబె ఔట్ చేసి ఫస్ట్ ఐపీఎల్ వికెట్ సాధించాడు. ఆ దశలో ఎంతో కీలకమైన మ్యాచ్ లో లక్నో కెప్టెన్ పంత్ మళ్లీ ఫెయిలయ్యాడు. 6 బంతులాడి 7 పరుగులే చేశాడు. ఇషాన్ మలింగ బౌలింగ్ లో పంత్ వికెట్ పారేసుకున్నాడు.

ఆఖర్లో డ్రామా

పంత్ వికెట్ తో లక్నో స్కోరుబోర్డు నెమ్మదించింది. 15 ఓవర్లకు స్కోరు 146/2. మార్ క్రమ్ ను ఔట్ చేసిన హర్షల్ పటేల్ 150వ ఐపీఎల్ వికెట్ సాధించాడు. దీంతో లక్నో 200 స్కోరు చేయడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి.

చివర్లో సన్ రైజర్స్ బౌలర్లు గొప్పగా బౌలింగ్ చేశారు. పూరన్ క్రీజులో ఉన్నా షాట్లు ఆడలేకపోయాడు. కానీ రెండు వైడ్లు, ఓ నోబాల్ కలిపి 9 బాల్స్ వేసిన హర్షల్19వ ఓవర్లో 15 రన్స్ ఇచ్చాడు. నితీశ్ వేసిన లాస్ట్ ఓవర్లో లక్నో మూడు వికెట్లు కోల్పోయింది. లాస్ట్ బాల్ కు ఆకాశ్ దీప్ సిక్సర్ తో లక్నో స్కోరు 200 దాటింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం