ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ కు షాక్. ఈ టేబుల్ టాపర్ టీమ్ ను లక్నో సూపర్ జెయింట్స్ కంగుతినిపించింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన టైటాన్స్ గురువారం (మే 22) లక్నో చేతిలో 33 పరుగుల తేడాతో ఓడింది. 236 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ 202/9కి పరిమితమైంది.
జీటీ బ్యాటర్ షారుక్ ఖాన్ (29 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాటానికి ఫలితం లేకుండా పోయింది. లక్నో బౌలర్లలో ఒరోర్క్ 3, అవేష్ ఖాన్ 2, బదోని 2 వికెట్లు పడగొట్టారు. ఇప్పటికే ప్లేఆఫ్స్ కు దూరమైన లక్నోకు ఈ విజయంతో కాస్త ఊరట దక్కింది. మరోవైపు నంబర్ వన్ స్థానాన్ని పదిలపర్చుకుందామని అనుకున్న జీటీకి ఈ మ్యాచ్ లో నిరాశే ఎదురైంది.
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ చేరడానికి ప్రధాన కారణం టాప్-3 బ్యాటర్లు సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్, బట్లర్ ఫామ్. లక్నో సూపర్ జెయింట్స్ తో భారీ ఛేజింగ్ లోనూ ఈ ముగ్గురు మెరుగ్గానే బ్యాటింగ్ ఆరంభించారు. కానీ కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయారు.
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్ (21), శుభ్ మన్ గిల్ (35) టీమ్ కు మంచి ఆరంభాన్నిచ్చారు. 4.2 ఓవర్లలోనే 46 పరుగులు చేశారు. కానీ సుదర్శన్ ను ఒరోర్క్ ఔట్ చేసి జీటీ స్పీడ్ కు బ్రేక్ వేశాడు. అక్కడి నుంచి శుభ్ మన్, బట్లర్ (33) కలిసి ఇన్నింగ్స్ నడిపించారు. కానీ స్వల్ప వ్యవధిలో వీళ్లను ఔట్ చేసిన లక్నో తిరిగి పోటీలోకి వచ్చింది.
గుజరాత్ టైటాన్స్ విజయానికి 7 ఓవర్లలో 107 పరుగులు కావల్సి వచ్చింది. ఆ దశలో రూథర్ ఫర్డ్, షారుక్ ఖాన్ చెలరేగారు. ఎడాపెడా బౌండరీలు కొట్టారు. 14, 15 ఓవర్లలో కలిసి 36 పరుగులు రాబట్టారు. కానీ ఒకే ఓవర్లో రూథర్ ఫర్డ్ (38), రాహుల్ తెవాటియా (2)ను ను ఒరోర్క్ ఔట్ చేయడంతో గుజరాత్ ఆశలు కూలాయి. ఆ వెంటనే 22 బాల్స్ లో ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు షారుక్ ఖాన్.
అప్పటివరకూ ఒంటరి పోరాటం చేసిన షారుక్ ఖాన్ ను అవేశ్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్లలో పార్ట్ టైమ్ స్పిన్నర్ ఆయూష్ బదోని రెండు వికెట్లు పడగొట్టడం గమనార్హం. చివరకు జీటీ 202 స్కోరు వద్దే ఆగిపోయింది.
అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 2 వికెట్లకు 235 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (64 బంతుల్లో 117; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీతో సత్తాచాటాడు. ఐపీఎల్ లో తన ఫస్ట్ హండ్రెడ్ ను అందుకున్నాడు. పూరన్ (27 బంతుల్లో 56; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా మెరిశాడు.
సంబంధిత కథనం