IPL 2025 LSG vs CSK: పంత్ ఫైటింగ్.. బ్రేక్ వేసిన సీఎస్కే బౌలర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
IPL 2025 LSG vs CSK: హోం గ్రౌండ్ లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ లో మరోసారి తడబడింది. భారీ స్కోరు చేయకుండా ఆ టీమ్ కు సీఎస్కే బ్రేక్ వేసింది. కెప్టెన్ పంత్ పోరాటంతో చివరకు లక్నో 160కి పైగా స్కోరు చేయగలిగింది.
పూరన్, మిచెల్ మార్ష్ విధ్వంసంతో భారీ స్కోర్లు నమోదు చేస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ కు బ్రేక్ పడింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు గొప్పగా బౌలింగ్ చేశారు. కెప్టెన్ రిషబ్ పంత్ (49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఫైటింగ్ తో లక్నో పోరాడే స్కోరు సాధించగలిగింది.
బ్యాటింగ్ కు కష్టంగా ఉన్న పిచ్ పై సోమవారం (ఏప్రిల్ 14) ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది.
షాక్ మీద షాక్
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నోకు షాక్ మీద షాక్ లు తగిలాయి. ఫస్ట్ ఓవర్లోనే ఫామ్ లో ఉన్న మార్ క్రమ్ (6) పాయింట్ లో రాహుల్ త్రిపాఠి పట్టిన సెన్సేషనల్ క్యాచ్ కు పెవిలియన్ చేరాడు.
ఈ సీజన్ లో అత్యధిక పరుగుల వీరుల్లో అగ్రస్థానంలో ఉన్న పూరన్ (8), మూడో స్థానంలో ఉన్న మిచెల్ మార్ష్ (30) కూడా నిలబడలేకపోయారు. పూరన్ ను అన్షుల్ ఎల్బీగా ఔట్ చేశాడు. ఓ రెండు ఫోర్లు, సిక్సర్లు కొట్టిన మార్ష్ ను బౌల్డ్ చేశాడు జడేజా.
పంత్ నిలబడ్డా
రూ.27 కోట్ల ధరకు న్యాయం చేయడం లేదంటూ విమర్శలు ఎదుర్కొంటున్న లక్నో కెప్టెన్ పంత్ ఈ మ్యాచ్ లో నిలబడ్డాడు. కానీ స్పీడ్ గా ఆడలేకపోయాడు. బౌండరీలు కొట్టేందుకు కష్టపడ్డాడు.
మరోవైపు ఒవర్టన్ బౌలింగ్ లో వరుసగా రెండు మెరుపు సిక్సర్లు బాదిన ఆయూష్ బదోని (22)ని జడ్డూ బోల్తా కొట్టించాడు. ధోని స్టంపౌట్ తో బదోని వెళ్లిపోయాడు. యంగ్ స్పిన్నర్ నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 13 రన్స్ మాత్రమే ఇచ్చాడు.
ఆఖర్లో మెరుపులు
39 బంతుల్లో 40 పరుగులతో నిలిచిన పంత్ ఆఖర్లో స్పీడ్ అందుకున్నాడు. పతిరణ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టాడు. 42 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేరుకున్నాడు. ఐపీఎల్ లో అతనికి ఇది సెకండ్ స్లోయెస్ట్ ఫిఫ్టీ. ఖలీల్ అహ్మద్ వేసిన 19వ ఓవర్లో పంత్, సమద్ (20) చెరో సిక్సర్ బాదారు.
లాస్ట్ ఓవర్లో పంత్ ఔటైపోయాడు. ఈ ఓవర్లో నాలుగు వైడ్లు వేసిన పతిరణ 11 రన్స్ ఇచ్చాడు. దీంతో లక్నో స్కోరు 160 దాటింది. సీఎస్కే బౌలర్లలో జడేజా, పతిరణ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
సంబంధిత కథనం