ఓటములతో ఐపీఎల్ 2025 సీజన్ ను ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తొలి విజయం కోసం మరో పోరుకు సిద్ధమయ్యాయి. బుధవారం (మార్చి 26) గువాహాటిలో ఈ మ్యాచ్ జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ కు ఇది సెకండ్ హోం గ్రౌండ్. ఆ టీమ్ తాత్కాలిక కెప్టెన్ కు రియాన్ పరాగ్ కు ఇది సొంతగడ్డ. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2025 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తన తొలి మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. ఎంత గట్టిగా పోరాడినా సన్‌రైజర్స్ భారీ స్కోరును రాజస్థాన్ అందుకోలేకపోయింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 286/6 రికార్డ్ స్కోరు చేసింది. ఛేజింగ్ లో రాజస్థాన్ 242/6కే పరిమితమైంది. కోల్ కతాతో పోరులో రాజస్థాన్ తుది జట్టులో ఓ ఛేంజ్ చేసింది. ఫారుఖీ ప్లేస్ లో హసరంగను ఆడిస్తోంది.
డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ కు దాని సొంతగడ్డ ఈడెన్ గార్డెన్స్ లోనే ఆర్సీబీ షాకిచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. కెప్టెన్ రహానె మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. ఛేజింగ్ లో ఫిల్ సాల్ట్ (56), విరాట్ కోహ్లి (59 నాటౌట్) చెలరేగడంతో ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ తో మ్యాచ్ కోసం కేకేఆర్ ఓ మార్పు చేసుకుంది. అనారోగ్యంతో ఉన్న నరైన్ స్థానంలో మొయిన్ అలీని తీసుకుంది.
ఐపీఎల్ 2025లో పాయింట్ల ఖాతా తెరిచేందుకు కేకేఆర్, రాజస్థాన్ వెయిట్ చేస్తున్నాయి. బుధవారం ఈ రెండింట్లో ఓ టీమ్ విజయం సాధిస్తుంది. ఆ గెలుపు కోసం కేకేఆర్, ఆర్ఆర్ గట్టిగానే పోరాడబోతున్నాయి. రెండు జట్లూ అన్ని విభాగాల్లో పటిష్ఠంగానే ఉన్నాయి. మరి గెలిచే టీమ్ ఏదో చూడాలి.
సంబంధిత కథనం