ఐపీఎల్ 2025 సీజన్ షురూ అయింది. శనివారం (మార్చి 22) సీజన్ ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. మొదట బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానె (31 బంతుల్లో 56) ఈ సీజన్ లో ఫస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. సునీల్ నరైన్ (26 బంతుల్లో 44 పరుగులు) కూడా అదరగొట్టాడు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్య 3 వికెట్లతో సత్తాచాటాడు. హేజిల్ వుడ్ 2 వికెట్లు తీసుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఐపీఎల్ 2025 ఫస్ట్ మ్యాచ్ ను ఆ టీమ్ మెరుగ్గా ప్రారంభించలేకపోయింది. ఓపెనర్ డికాక్ (4)ను హేజిల్ వుడ్ ఔట్ చేశాడు. కానీ మరో ఓపెనర్ సునీల్ నరైన్ కు జత కలిసిన కెప్టెన్ రహానె విధ్వంసాన్ని చూపించాడు. రహానె 2.0 స్టైల్లో బ్యాటింగ్ కొనసాగిస్తూ అలవోకగా భారీ షాట్లు బాదాడు. మరో ఎండ్ లో నరైన్ కూడా బౌండరీల వేట కొనసాగించాడు.
రైటార్మ్ బ్యాటర్ రహానె ఓ ఎండ్ లో.. లెఫ్టార్మ్ బ్యాటర్ నరైన్ మరో ఎండ్ లో ఆర్సీబీ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఎడాపెడా బౌండరీలు బాదేశారు. ముఖ్యంగా రహానె పూర్తి డిఫరెంట్ గా కనిపించాడు. ఇలా బ్యాటింగ్ చేస్తోంది రహానేనా అనిపించాడు. టెస్టుల్లో క్రీజులో పాతుకుపోయే రహానె మెరుపు షాట్లతో ఈడెన్ గార్డెన్స్ ను హోరెత్తించాడు. 31 బంతుల్లో అతను 6 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగాడు. నరైన్ ఏమో 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. ఈ జోడీ సెకండ్ వికెట్ కు 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
9.5 ఓవర్లకు 107/1తో నిలిచిన కేకేఆర్ ఈజీగా 200కు పైగా స్కోరు చేస్తుందనిపించింది. కానీ ఆర్సీబీ బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. ముఖ్యంగా స్పిన్నర్ కృనాల్ పాండ్య కేకేఆర్ ను కట్టడి చేశాడు. నరైన్ ను ఔట్ చేసిన రసిఖ్ సలామ్ ఈ పార్ట్‌నర్‌షిప్ ను బ్రేక్ చేశాడు. ఆ వెంటనే కృనాల్ తన వరుస ఓవర్లలో రహానె, వెంకటేశ్ అయ్యర్ (6)తో పాటు ప్రమాదకర రింకు సింగ్ (12)ను ఔట్ చేశాడు. కేకేఆర్ ను చావుదెబ్బ కొట్టాడు.
డెత్ ఓవర్లలోనూ ఆర్సీబీ గొప్పగా బౌలింగ్ చేసింది. యంగ్ ప్లేయర్ అంగ్ క్రిష్ రఘువన్శీ (22 బంతుల్లో 30) నిలబడ్డా వేగంగా ఆడలేకపోయాడు. 19వ ఓవర్లో అతణ్ని ఔట్ చేసిన యశ్ దయాల్ 4 పరుగులే ఇచ్చాడు. 20వ ఓవర్లో హేజిల్ వుడ్ 5 పరుగులే ఇచ్చి హర్షిత్ రాణాను ఔట్ చేశాడు.
సంబంధిత కథనం