ఐపీఎల్ 2025 ఫస్ట్ మ్యాచ్ లోనే డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ కు షాక్ తగిలింది. శనివారం (మార్చి 22) ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ను చిత్తుచేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (59 నాటౌట్)తో పాటు ఫిల్ సాల్ట్ (56) ఆర్సీబీని గెలిపించారు. మొదట కేకేఆర్ 174/8 స్కోరు చేసింది. ఛేజింగ్ లో ఆర్సీబీ 3 వికెట్లు కోల్పోయి 16.2 ఓవర్లలోనే టార్గెట్ రీచ్ అయింది.
ఐపీఎల్ 2024లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో ఫిల్ సాల్ట్ కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్ లో ఆర్సీబీతో చేరిన అతను కేకేఆర్ పైనే చెలరేగాడు. కోహ్లీతో కలిసి ఓపెనర్ గా బరిలో దిగిన సాల్ట్ రెచ్చిపోయాడు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కోహ్లి కూడా విధ్వంసానికి దిగాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన పేసర్ వైభవ్ అరోరా బౌలింగ్ లో ఈ ఓపెనర్లు ధనాధన్ షాట్లు ఆడారు.
ఛేజింగ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సాల్ట్ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఓవర్లో సాల్ట్ వరుసగా 4, 6, 4, 4 బాదడం విశేషం. దీంతో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. ఆ వెంటనే స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్ లో కోహ్లి వరుసగా రెండు సూపర్ సిక్సర్లు కొట్టాడు. పవర్ ప్లేలోనే 80 పరుగులు చేసిన ఆర్సీబీ విజయాన్ని ఖాయం చేసుకుంది.
హాఫ్ సెంచరీ తర్వాత వరుణ్ బౌలింగ్ లో సాల్ట్ ఔటయ్యాడు. 31 బంతుల్లోనే సాల్ట్ 59 పరుగులు చేశాడు. 4 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. దేవ్ దత్ పడిక్కల్ (10) నిలబడలేకపోయాడు. కానీ మరో ఎండ్ లో పాతుకుపోయిన కోహ్లి బాదుడు కొనసాగించాడు. 30 బాల్స్ లో ఫిఫ్టీ చేరుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ రజత్ పటీదార్ (16 బంతుల్లో 34) ఊచకోత కొనసాగించాడు. హర్షిత్ రాణా ఓవర్లో రజత్ నాలుగు ఫోర్లు కొట్టాడు. రజత్ పెవిలియన్ చేరినా.. కోహ్లి చివరి వరకూ నిలబడి జట్టును గెలిపించాడు. విరాట్ 36 బంతుల్లో అజేయంగా 59 పరుగులు చేశాడు. 3 సిక్సర్లు, 4 ఫోర్లు సాధించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కేకేఆర్ కు మెరుపు ఆరంభం దక్కింది. ఓపెనర్ డికాక్ (4)ను హేజిల్ వుడ్ ఔట్ ఫస్ట్ ఓవర్లోనే ఔట్ చేశాడు. కానీ మరో ఓపెనర్ సునీల్ నరైన్ (26 బంతుల్లో 44) కు జత కలిసిన కెప్టెన్ రహానె (31 బంతుల్లో 56) విధ్వంసాన్ని చూపించాడు. రహానె 2.0 స్టైల్లో బ్యాటింగ్ కొనసాగిస్తూ అలవోకగా భారీ షాట్లు బాదాడు. మరో ఎండ్ లో నరైన్ కూడా బౌండరీల వేట కొనసాగించాడు. ఈ జోడీ సెకండ్ వికెట్ కు 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
9.5 ఓవర్లకు 107/1తో నిలిచిన కేకేఆర్ ఈజీగా 200కు పైగా స్కోరు చేస్తుందనిపించింది. కానీ ఆర్సీబీ బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. ముఖ్యంగా స్పిన్నర్ కృనాల్ పాండ్య కేకేఆర్ ను కట్టడి చేశాడు. నరైన్ ను ఔట్ చేసిన రసిఖ్ సలామ్ ఈ పార్ట్‌నర్‌షిప్ ను బ్రేక్ చేశాడు. ఆ వెంటనే కృనాల్ తన వరుస ఓవర్లలో రహానె, వెంకటేశ్ అయ్యర్ (6)తో పాటు ప్రమాదకర రింకు సింగ్ (12)ను ఔట్ చేశాడు. కేకేఆర్ ను చావుదెబ్బ కొట్టాడు.
డెత్ ఓవర్లలోనూ ఆర్సీబీ గొప్పగా బౌలింగ్ చేసింది. యంగ్ ప్లేయర్ అంగ్ క్రిష్ రఘువన్శీ (22 బంతుల్లో 30) నిలబడ్డా వేగంగా ఆడలేకపోయాడు. 19వ ఓవర్లో అతణ్ని ఔట్ చేసిన యశ్ దయాల్ 4 పరుగులే ఇచ్చాడు. 20వ ఓవర్లో హేజిల్ వుడ్ 5 పరుగులే ఇచ్చి హర్షిత్ రాణాను ఔట్ చేశాడు.
సంబంధిత కథనం