Preity Zinta KKR: ప్రీతి జింటా పోస్టుపై కేకేఆర్ కౌంటర్.. శ్రేయస్ కంటే డికాక్ ఇన్నింగ్స్ గ్రేట్!
Preity Zinta KKR: సొట్టబుగ్గల చిన్నది ప్రీతి జింటా చేసిన పోస్టుపై కేకేఆర్ కౌంటర్ వేసింది. ఈ అందాల భామను టీజ్ చేసేలా పోస్టు పెట్టింది. పంజాబ్ కింగ్స్ తరపున శ్రేయస్ అయ్యర్ 97 నాటౌట్ గా నిలవగా.. కేకేఆర్ బ్యాటర్ డికాక్ కూడా అజేయంగా 97 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2025లో ఇప్పటికే రెండు సార్లు సరిగ్గా 97* స్కోర్లు నమోదయ్యాయి. పంజాబ్ కింగ్స్ తరఫున శ్రేయస్ అయ్యర్, కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ లో క్వింటన్ డికాక్ ఈ పరుగులు సాధించారు. అయితే శ్రేయస్ ఇన్నింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా ప్రశంసలు కురిపించింది. కొన్ని 97 స్కోర్లు హండ్రెడ్ కంటే ఎక్కువ అని పోస్టు చేసింది. దీనిపై కేకేఆర్ కౌంటర్ వేసినట్లే కనిపించింది. డికాక్ చేసిన 97 ఇంకా గ్రేట్ అనే అర్థం వచ్చేలా ఎక్స్ లో పోస్టు చేసింది. ఇప్పుడీ పోస్టు వైరల్ గా మారింది.
కేకేఆర్ మాజీ కెప్టెన్
గతేడాది ఐపీఎల్ లో కేకేఆర్ కెప్టెన్ గా శ్రేయస్ ఆ టీమ్ కు ట్రోఫీ అందించిన సంగతి తెలిసిందే. అయినా ఆ టీమ్ శ్రేయస్ ను వదిలేసుకుంది. వేలంలో ప్రీతి జింటా టీమ్ పంజాబ్ కింగ్స్ శ్రేయస్ ను రూ.26.75 కోట్లకు సొంతం చేసుకుని, కెప్టెన్ గా ఎంపిక చేసింది. పంజాబ్ సారథిగా శ్రేయస్ తొలి మ్యాచ్ లోనే అదరగొట్టాడు. గుజరాత్ టైటాన్స్ పై అజేయంగా 97 పరుగులు చేశాడు. 9 సిక్సర్లు బాదాడు. గతంలో రెండుసార్లు 96 పరుగులు చేసిన అయ్యర్ తన తొలి ఐపీఎల్ సెంచరీ కోసం ప్రయత్నిస్తున్నాడు.
గుజరాత్ టైటాన్స్ పై శ్రేయస్ ఆడిన ఇన్నింగ్స్ ను ప్రీతి జింటా మెచ్చుకుంది. ‘‘ఈ టోర్నీలో అద్భుతమైన ఆరంభం. కొన్ని 97 స్కోర్లు హండ్రెడ్ కంటే బెటర్. క్లాస్, నాయకత్వం, దూకుడు చూపించిన శ్రేయస్ కు టేక్ ఏ బో. ఒక్కటిగా టీమ్ ఆడిన విధానం ఎంతో నచ్చింది’’ అని పోస్టు చేసిన ప్రీతి జింటా కొంతమంది ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనననూ మెన్షన్ చేసింది.
డికాక్ విధ్వంసం
ఇక రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో కేకేఆర్ తరపున డికాక్ చెలరేగాడు. 97 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. ఆర్చర్ బౌలింగ్ లో వరుసగా 4, 6, 6 బాది డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ను గెలిపించాడు.
భారీ లక్ష్యం లేకపోయినా క్లిష్టమైన పిచ్ పై కష్టమైన ఛేజింగ్ లో టీమ్ ను డికాక్ విజయం దిశగా నడిపించాడు. దీంతో డికాక్ ఇన్నింగ్స్ ను అభినందిస్తూ కేకేఆర్ టీమ్ ఎక్స్ లో పోస్టు చేసింది. 97 గ్రేటెస్ట్ అనే అర్థం వచ్చేలా పోస్టు పెట్టింది. అయితే ప్రీతి జింటా పోస్టుకు కౌంటర్ గానే కేకేఆర్ ఇలా పెట్టిందనే కామెంట్లు వస్తున్నాయి.
సంబంధిత కథనం