యువరాజ్ సింగ్.. టీమిండియా దిగ్గజ ఆల్ రౌండర్. భారత్ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలుచుకోవడంలో యువీ కీ రోల్ ప్లే చేశాడు. అలాంటి లెజెండరీ ప్లేయర్.. ఓ యువ ఆల్ రౌండర్ కోసం ఎండలో నిలబడ్డాడు. మరి యువరాజ్ ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం. అంతర్జాతీయ క్రికెట్ కు యువీ రిటైర్మెంట్ ప్రకటించి ఆరేళ్లు అవుతోంది. అయినా ఇండియన్ క్రికెట్ కోసం అతను తన వంతు సాయం చేస్తూనే ఉన్నాడు.
ఐపీఎల్ 2025లో యంగ్ ఆల్ రౌండర్ రమణ్ దీప్ సింగ్ కేకేఆర్ కు ఆడుతున్నాడు. ఈ టాలెంటెడ్ ప్లేయర్ ఇప్పటికే ఇండియా తరపున టీ20 డెబ్యూ చేశాడు. అయితే తన కెరీర్ లో మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడని రమణ్ దీప్ వెల్లడించాడు. దేశవాళీ క్రికెట్లో రమణ్.. పంజాబ్ కు ఆడుతుంటాడు.
‘‘యువీతో నేను టచ్ లోనే ఉంటా. అతను పంజాబ్ కు చెందినవాడు. అతను నా బ్యాటింగ్ చూడటం నా అదృష్టం. మొదట్లో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేసినప్పుడు పీసీఏ స్టేడియంలో ప్రాక్టీస్ చేసేవాళ్లం. యువీ పాజీ కూడా అక్కడికి వచ్చేవాడు. ఒకరోజు నా కోసం ప్రాక్టీస్ సెషన్ మిస్ అయ్యి సెంటర్ వికెట్ ఏర్పాటు చేశాడు. మధ్యాహ్నం అంతా అంపైర్ పొజిషన్ లో ఎండలో నిలబడి నా బ్యాటింగ్ వీడియోలను రికార్డ్ చేశాడు. నా నంబర్ తీసుకొని ఆ వీడియోలను షేర్ చేశాడు. నాకు సలహాలిచ్చాడు. ఏం చేయాలో? ఏం చేయకూడదో చెప్పాడు’’ అని ఓ పాడ్ కాస్ట్ లో రమణ్ దీప్ పేర్కొన్నాడు.
‘‘యువీది పెద్ద మనసు. క్రికెటర్ గా కంటే కూడా ఆయన సొంత క్యారెక్టర్ ఎంతో ప్రత్యేకమైంది. అది ఆయన నైజం. శుభ్ మన్, అభిషేక్, అన్మోల్ ప్రీత్ సింగ్, ప్రభ్ సిమ్రన్ సింగ్ కు యువీ సాయం చేశాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే వారంతా తమ సమస్యలను యువరాజ్ సింగ్ వద్దకు తీసుకెళ్తారు. యువీ ఫోన్ ఎత్తకపోవడం ఎప్పుడూ జరగలేదు. ఏడాది పొడవునా బిజీగా ఉండే తనలాంటి వ్యక్తి మాకు టైమ్ ఇస్తాడు’’ అని రమణ్ దీప్ చెప్పాడు.
యువ క్రికెటర్లకు యువరాజ్ సింగ్ అండగా నిలుస్తున్నాడు. శుభ్ మన్ గిల్, అభిషేక్ శర్మ తదితర క్రికెటర్ల వెనుక యువీ ఉన్నాడు. బ్యాటింగ్ పాఠాలు చెబుతూ.. ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటాడు. జింబాబ్వేపై అభిషేక్ శర్మ సెంచరీ తర్వాత యువీ వీడియో కాల్ చేసి మాట్లాడిన సంగతి తెలిసిందే.
ఇక ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన యువీ సరసన చేరేందుకు రమణ్ దీప్ ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే షేర్-ఎ-పంజాబ్ టోర్నమెంట్లో రమణ్ దీప్ రెండు సార్లు.. ఒకే ఓవర్లో అయిదు సిక్సర్లు కొట్టాడు. కానీ ఆరో సిక్సర్ ను మాత్రం అందుకోలేకపోయాడు.
సంబంధిత కథనం