'సినిమాలో హీరో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. విలన్లతో పోరాడతాడు. చివరకు హీరోగా నిలుస్తాడు. గత ఏడాది కాలంలో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్య కూడా ఇలాంటి కష్టాలను ఎదుర్కొని హీరోగా నిలిచాడు. అందుకే అతని కథ బయోపిక్ కు ఏ మాత్రం తక్కువ కాదని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ చెప్పాడు. హార్దిక్ మెంటల్ టార్చర్ ను దాటి హీరోగా మారాడని కైఫ్ తెలిపాడు.
‘‘హార్దిన్ ఆ నొప్పిని తనలోనే ఉంచుకుని ముందుకు సాగాడు. ఇది హార్దిక్ పాండ్య కమ్‌బ్యాక్ కథ. అదో బ్యాడ్ జర్నీ. అభిమానులు అతణ్ని హేళన చేశారు. తిట్టారు. ఎగతాళి చేశారు. అవమానాన్ని భరిస్తూ ముందుకు సాగడం చాలా కష్టం. ఒక ఆటగాడు దాన్ని ఎప్పటికీ మరచిపోడు. ఓ ఆటగాణ్ని అవమానించడం కరెక్ట్ కాదు. హార్దిక్ మెంటల్ టార్చర్ అనుభవించాడు’’ అని కైఫ్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో పేర్కొన్నాడు.
‘‘ఆ మెంటల్ టార్చర్ తర్వాత హార్దిక్ సింహంలా పోరాడాడు. టీ20 ప్రపంచకప్ లో మెరుగైన ప్రదర్శన చేశాడు. ఫైనల్లో హెన్రిచ్ క్లాసెన్ ను ఔట్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టాడు. జంపా బౌలింగ్ లో సిక్సర్లు కొట్టాడు. బ్యాట్ తో, బంతితో సత్తాచాటాడు. అతని గురించి బయోపిక్ తీస్తే.. గత ఏడు నెలల్లో ఎదుర్కొన్న సవాళ్లు ఇతర ఆటగాళ్లకు ఉదాహరణగా ఉంటాయి. ప్రశాంతంగా ఉంటూ తమ బలాలను నమ్మి కమ్ బ్యాక్ చేయడం ఎలాగో పాండ్య నిరూపించాడు’’ అని కైఫ్ తెలిపాడు.
2024 ఐపీఎల్ సీజన్ కు ముందు రోహిత్ ను స్థానంలో హార్దిక్ పాండ్య ను కెప్టెన్ గా ఎంపిక చేయడంతో పెద్ద గొడవ చెలరేగింది. రోహిత్ ఫ్యాన్స్.. ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ ఓనర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబయి ఇండియన్స్ జెర్సీలను తగలబెట్టారు. ఇక మైదానంలో హార్దిక్ కనిపిస్తే చాలు బూయింగ్ చేశారు. హేళన చేశారు. దారుణంగా తిట్టారు. మరోవైపు హార్దిక్ కెప్టెన్సీలో ముంబయి గత సీజన్ లో లాస్ట్ ప్లేస్ లో నిలిచింది.
గతేడాది ఐపీఎల్ లో అవమానాల తర్వాత హార్దిక్ తన గేమ్ పైనే ఫోకస్ పెట్టాడు. టీ20 ప్రపంచకప్ లో అదరగొట్టాడు. ఫైనల్లో కీలకమైన క్లాసెన్ వికెట్ పడగొట్టి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఇప్పుడు మళ్లీ ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా బరిలో దిగబోతున్నాడు. అందుకే హార్దిక్ స్టోరీ బయోపిక్ కు పూర్తి అర్హత కలిగిందని కైఫ్ అన్నాడు.
హార్దిక్ 2025 ఐపీఎల్ లో బలంగా తిరిగి వస్తాడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ముంబయి ఇండియన్స్ ను ప్లేఆఫ్స్ కు నడిపిస్తాడని కైఫ్ నమ్ముతున్నాడు.
"2025 ఐపీఎల్ లో హార్దిక్ కోసం చూడండి. ముంబయి టాప్ 4 లో ఉంటుంది. అదే హామీ. అభిమానులు మళ్ళీ అతన్ని సపోర్ట్ చేస్తారు. రోహిత్ శర్మ అతనికి మద్దతు ఇస్తాడు. అతని అత్యంత క్లిష్ట దశలో అతను భారతదేశానికి రెండు ట్రోఫీలు గెలుచుకున్నాడు. అది సులభం కాదు కానీ అతను తిరిగి పోరాడాడు కాబట్టి హ్యాట్స్ ఆఫ్’’ అని కైఫ్ అన్నాడు.
సంబంధిత కథనం