మహ్మద్ సిరాజ్ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తో దీర్ఘకాలం గడిపిన తర్వాత గుజరాత్ టైటాన్స్ (జిటి) తో తన మొదటి సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. 2018 నుండి ఆర్‌సీబీ పేస్ దాడిలో భాగంగా ఉన్న సిరాజ్, ఇప్పుడు కొత్త ఫ్రాంచైజీకి మారాడు. అయితే, తన మాజీ జట్టు, దాని నాయకుడు విరాట్ కోహ్లీ పట్ల ఎమోషన్ అయ్యాడు.
“నిజాయితీగా చెప్పాలంటే విరాట్ కోహ్లీ నా కెరీర్‌లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2018, 2019లో నా కష్టకాలంలో అండగా నిలిచాడు. నన్ను సపోర్ట్ చేశాడు. నన్ను రిటైన్ చేసుకున్నాడు. ఆ తర్వాత నా బౌలింగ్ గ్రాఫ్ పెరిగింది. కోహ్లి నాకు చాలా సపోర్టివ్‌గా ఉన్నాడు. ఆర్సీబీని వీడటంతో ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నా. ఈ సీజన్ లో ఆర్సీబీపై ఆడేటప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఆ మ్యాచ్ ఏప్రిల్ 2న ఉంది’’ అని సిరాజ్ ఏఎన్‌ఐకి తెలిపాడు.
ఆర్‌సీబీ నుండి సిరాజ్ వెళ్ళిపోవడం ఒక శకం ముగిసిందనే చెప్పొచ్చు. ఆ ఫ్రాంచైజీ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో సిరాజ్ మూడో బౌలర్. 87 మ్యాచ్‌లలో 31.45 సగటుతో 83 వికెట్లు తీశాడు. ఉత్తమ ప్రదర్శన 4/21 గా ఉంది. 2023 సీజన్లో సిరాజ్ బెస్ట్ పర్ ఫార్మెన్స్ చేశాడు. ఆ సీజన్లో అతను 14 మ్యాచ్ ల్లో 19.74 సగటుతో 19 వికెట్లు పడగొట్టాడు.
ఆర్సీబీతో ఆడిన తర్వాత ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ తో కొత్త ఛాలెంజ్ ను సిరాజ్ ఎదుర్కోబోతున్నాడు. ‘‘జట్టులోని పేసర్లతో కలిసి శిక్షణ కొనసాగిస్తున్నా. ఎలా ప్లాన్ చేయాలో, అమలు చేయాలో మా టీమ్ కు తెలుసు. గుజరాత్ టైటాన్స్‌లో ఉండటం నాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది” అని సిరాజ్ అన్నాడు.
2022లో ఐపీఎల్ లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ అదే ఏడాది హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో విజేతగా నిలిచింది. 2023లో మరోసారి ఫైనల్ చేరింది. తుదిపోరులో ఓడింది. ఇక హార్దిక్ జట్టును వదిలి వెళ్లిపోయిన తర్వాత శుభ్‌మన్ గిల్ గుజరాత్ కెప్టెన్ అయ్యాడు. 2024లో 14 మ్యాచ్‌లలో ఐదు విజయాలతో ఆ జట్టు 8వ స్థానంలో నిలిచింది.
సంబంధిత కథనం