టాప్ ప్లేస్ పై టైటాన్స్ గురి.. లక్నోతో పోరు.. టాస్ గెలిచిన గుజరాత్.. ఈ ప్లేయర్స్ స్పెషల్.. ఓ లుక్కేయండి-ipl 2025 gt vs lsg toss update gujarat titans aims number one place look these special players buttler gill sudharsan ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  టాప్ ప్లేస్ పై టైటాన్స్ గురి.. లక్నోతో పోరు.. టాస్ గెలిచిన గుజరాత్.. ఈ ప్లేయర్స్ స్పెషల్.. ఓ లుక్కేయండి

టాప్ ప్లేస్ పై టైటాన్స్ గురి.. లక్నోతో పోరు.. టాస్ గెలిచిన గుజరాత్.. ఈ ప్లేయర్స్ స్పెషల్.. ఓ లుక్కేయండి

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ బెర్తులు కన్ఫామ్ అయ్యాయి. నాలుగు టీమ్స్ ప్లేఆఫ్స్ చేరిపోయాయి. ఇక మిగిలిన లీగ్ మ్యాచ్ ల్లో కిక్ ఏముంది అంటారా? పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ ను మరింత స్ట్రాంగ్ చేసుకునేందుకు గుజరాత్ టైటాన్స్ బరిలో దిగుతోంది. నేడు లక్నోతో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో ఈ ప్లేయర్స్ పై ఓ లుక్కేయండి.

గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్ (PTI)

ఐపీఎల్ 2025లో ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన గుజరాత్ టైటాన్స్ మరో కీలక పోరుకు సిద్దమైంది. గురువారం (మే 22) హోం గ్రౌండ్ అహ్మదాబాద్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో టైటాన్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ ను కాపాడుకునేందుకు ఈ మ్యాచ్ లో టైటాన్స్ కు గెలుపు అవసరం.

18 పాయింట్లతో

గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. 12 మ్యాచ్ లాడిన ఆ టీమ్ 9 మ్యాచ్ లు గెలిచింది. మూడు ఓడింది. 18 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఈ ప్రదర్శనతోనే ప్లేఆఫ్స్ లో అడుగుపెట్టింది. ఆ టీమ్ ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లోనూ గెలిచి టాప్ ప్లేస్ ను కాపాడుకోవాలని టైటాన్స్ చూస్తోంది.

కొత్త జెర్సీలో

లక్నోతో మ్యాచ్ కోసం గుజరాత్ టైటాన్స్ కొత్త జెర్సీలో ఆడుతోంది. లావెండర్ కలర్ జెర్సీలో బరిలో దిగుతోంది. క్యాన్సర్ పై అవగాహన కోసం ఆ టీమ్ ఇలా చేస్తోంది. ఈ మంచి కార్యక్రమానికి గుజరాత్ శ్రీకారం చుట్టింది.

పరువు కోసమే

మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఆ టీమ్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. 12 మ్యాచ్ ల్లో 5 గెలిచిన లక్నో.. 7 ఓడింది. 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉన్న లక్నో పరువు కోసమే పోరాడనుంది.

ఈ ప్లేయర్స్

గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోరులో కొంతమంది ప్లేయర్స్ చాలా స్పెషల్. ముఖ్యంగా టైటాన్స్ టాప్-3 బ్యాటర్లు సెన్సేషనల్ ఫామ్ లో ఉన్నారు. ఓపెనర్లు సాయి సుదర్శన్ (617), శుభ్ మన్ గిల్ (601) ఐపీఎల్ 2025లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. టైటాన్స్ మరో డేంజరస్ బ్యాటర్ బట్లర్ (500) కూడా అదరగొడుతున్నాడు.

బౌలింగ్ లో చూస్తే ప్రసిద్ధ్ కృష్ణ‌ రెచ్చిపోతున్నాడు. ఈ టైటాన్స్ పేసర్ 21 వికెట్లతో టాప్ బౌలర్ గా కొనసాగుతున్నాడు. స్పిన్నర్ సాయి కిశోర్ (15) కూడా సత్తాచాటుతున్నాడు.

పంత్ ఏం చేస్తాడో?

కెప్టెన్ గా, బ్యాటర్ గా ఫెయిల్ అవుతున్న లక్నో సూపర్ జెయింట్స్ సారథి పంత్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రూ.27 కోట్ల ధరకు న్యాయం చేయలేదంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి ఈ మ్యాచ్ లో అతను ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. మరోవైపు లక్నో స్పిన్నర్ దిగ్వేష్ రతి ఓ మ్యాచ్ నిషేధం కారణంగా టైటాన్స్ తో పోరుకు దూరమయ్యాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం