టీ20 క్రికెట్ తో ఫ్యాన్స్ ను ఊపేసేందుకు ఐపీఎల్ 2025 వచ్చేసింది. ఐపీఎల్ 18వ సీజన్ కు తెరలేచింది. రెండు నెలల పాటు ఇక పొట్టి క్రికెట్ కిక్కే కిక్కు. శనివారం (మార్చి 22) గ్రాండ్ గా సీజన్ ఓపెనింగ్ సెర్మనీ జరిగింది. ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్ మొదట బ్యాటింగ్ కు దిగనుంది.
ఐపీఎల్ 2024లో కేకేఆర్ ఛాంపియన్ గా నిలిచింది. ఈ సీజన్లో టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఆ టీమ్ బరిలో దిగింది. సొంతగడ్డ ఈడెన్ గార్డెన్స్ లో తన తొలి మ్యాచ్ లో ఆర్సీబీని ఢీ కొడుతోంది. ఈ మ్యాచ్ లో విజయంతో సీజన్ ను ఘనంగా మొదలెట్టాలనే లక్ష్యంతో షారుక్ ఖాన్ జట్టు ఉంది. సీనియర్ బ్యాటర్ అజింక్య రహానె సారథ్యంలో ఆ జట్టు టైటిల్ వేటకు సై అంటోంది. కేకేఆర్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగుతోంది.
ఐపీఎల్ లో 17 సీజన్లు గడిచాయి. కానీ ఆర్సీబీ మాత్రం ఒక్కసారి కూడా టైటిల్ ముద్దాడలేకపోయింది. కింగ్ కోహ్లి ఐపీఎల్ ట్రోఫీ ముద్దాడితే చూడాలనే ఫ్యాన్స్ కల నెరవేరడం లేదు. ఈ సారి మాత్రం కప్ కచ్చితంగా సొంతం చేసుకోవాలనే టార్గెట్ తో సీజన్ కు సై అంటోంది. ఐపీఎల్ లో ఆర్సీబీని నడిపించడం ఎంతో ఉత్తేజితంగా ఉందని రజత్ పాటీదార్ అన్నాడు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆర్సీబీ ఆడుతోంది.
ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. గతేడాది ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి కేకేఆర్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 2008 ఐపీఎల్ తర్వాత ఓ సీజన్ తొలి మ్యాచ్ లో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ తలపడటం ఇదే మొదటిసారి. ఈ రెండు టీమ్స్ కొత్త కెప్టెన్లతో బరిలో దిగుతున్నాయి. కోల్ కతాకు అజింక్య రహానె, ఆర్సీబీకి రజత్ పాటీదార్ కెప్టెన్.
సంబంధిత కథనం