కొత్త చరిత్ర శ్రీకారం కావడానికి ఇంకొక్క మ్యాచే. ఐపీఎల్ హిస్టరీలో కొత్త ఛాంపియన్ ఎవరో తెలిసేందుకు మిగిలింది ఇంకొక్క మ్యాచే. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించే జట్టు ఏదో తెలిసేందుకు మిగిలింది ఇంకొక్క మ్యాచే. ఈ రోజే ఐపీఎల్ 2025 ఫైనల్. మంగళవారం (జూన్ 3) తుదిపోరుకు వేళైంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టైటిల్ కోసం ఆర్సీబీతో పంజాబ్ కింగ్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఫైనల్ చేరాయి. ఈ రెండు జట్లు లీగ్ దశలో 14 మ్యాచ్ ల్లో 9 గెలిచాయి. నాలుగు ఓడాయి. వర్షంతో ఓ మ్యాచ్ రద్దు అయింది. రెండు టీమ్స్ 19 పాయింట్ల చొప్పున సాధించాయి. కానీ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న పంజాబ్ (0.372) ఫస్ట్ ప్లేస్ లో, ఆర్సీబీ (0.301) సెకండ్ ప్లేస్ లో నిలిచాయి. క్వాలిఫయర్ 1లో పంజాబ్ పై గెలిచి ఆర్సీబీ ఫైనల్ చేరింది. క్వాలిఫయర్ 2లో ముంబయి ఇండియన్స్ ను పంజాబ్ ఓడించి తుదిరేసుకు అర్హత సాధించింది.
ఐపీఎల్ హిస్టరీ చూసుకుంటే రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగుతూనే ఉంది. ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ సమవుజ్జీలుగా కొనసాగుతున్నాయి. ఐపీఎల్ లో ఇప్పటివరకూ ఈ రెండు టీమ్స్ 36 మ్యాచ్ లు ఆడాయి. ఇందులో ఆర్సీబీ 18, పంజాబ్ కింగ్స్ 18 గెలిచాయి. ఈ సీజన్ లో ఈ రెండు జట్లు మూడు మ్యాచ్ ల్లో తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ 2, పంజాబ్ కింగ్స్ ఓ సారి విజయం సాధించాయి.
ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలనే కోహ్లి కల ఈ సారైనా తీరుతుందేమో చూడాలి. ఐపీఎల్ లీగ్ ఆరంభం నుంచి ఆ జట్టుతోనే అతను కొనసాగుతున్నాడు. గత 17 సీజన్లుగా టీమ్ ను గెలిపించేందుకు పోరాడుతూనే ఉన్నాడు. కానీ ఇప్పటివరకూ విజేతగా మాత్రం నిలవలేకపోయాడు. ఈ సారి కూడా కోహ్లి అద్భుత ఫామ్ లో ఉన్నాడు. 14 మ్యాచ్ ల్లో 614 పరుగులు సాధించాడు. 8 హాఫ్ సెంచరీలు బాదాడు. కోహ్లి జెర్సీ నంబర్ 18 కాబట్టి.. ఈ ఐపీఎల్ 18వ సీజన్ లో ఆర్సీబీ గెలుస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్రకు అడుగు దూరంలో నిలిచాడు. గతేడాది కోల్ కతా నైట్ రైడర్స్ ను కెప్టెన్ గా విజయతీరాలకు చేర్చాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ను గెలిపిస్తే.. వరుసగా రెండు సీజన్లలో రెండు వేర్వేరు జట్లను విజేతగా నిలిపిన ఫస్ట్ కెప్టెన్ గా చరిత్ర నెలకొల్పుతాడు. ఇప్పటికే ఢిల్లీ, కేకేఆర్ తో పాటు పంజాబ్ ను ఫైనల్ చేర్చిన శ్రేయస్.. మూడు టీమ్స్ ను ఐపీఎల్ టైటిల్ పోరుకు తీసుకెళ్లిన ఫస్ట్ కెప్టెన్ గా ఘనత సాధించాడు.
శ్రేయస్ అయ్యర్ బ్యాటర్ గానూ అదరగొడుతున్నాడు. 16 మ్యాచ్ ల్లో 603 పరుగులు చేశాడు. ఇక ఆర్సీబీ తరపున ఫిల్ సాల్ట్, కెప్టెన్ రజత్ పటీదార్, పేసర్ హేజిల్ వుడ్.. పంజాబ్ తరపున ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్, అర్ష్ దీప్ సింగ్ కీలకం కానున్నారు.
సంబంధిత కథనం