ఫస్ట్ కిస్ ఎవరిదో? ఐపీఎల్ కొత్త ఛాంపియన్ తేలేది నేడే.. ఫైనల్లో ఆర్సీబీతో పంజాబ్ ఢీ.. వర్షంతో మ్యాచ్ రద్దయితే ఎలా?-ipl 2025 final rcb vs pbks narendra modi stadium new champion of league virat kohli shreyas iyer ahmedabad ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఫస్ట్ కిస్ ఎవరిదో? ఐపీఎల్ కొత్త ఛాంపియన్ తేలేది నేడే.. ఫైనల్లో ఆర్సీబీతో పంజాబ్ ఢీ.. వర్షంతో మ్యాచ్ రద్దయితే ఎలా?

ఫస్ట్ కిస్ ఎవరిదో? ఐపీఎల్ కొత్త ఛాంపియన్ తేలేది నేడే.. ఫైనల్లో ఆర్సీబీతో పంజాబ్ ఢీ.. వర్షంతో మ్యాచ్ రద్దయితే ఎలా?

70 లీగ్ మ్యాచ్ లు.. మూడు ప్లేఆఫ్స్.. హోరాహోరీ పోరాటాలు.. రికార్డు బ్రేకింగ్ ప్రదర్శనలు.. ఇప్పుడిక ఐపీఎల్ 2025లో ఆఖరి పోరుకు వేళైంది. ఈ రోజే (జూన్ 3) ఫైనల్. కప్ కోసం ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఇందులో ఏ టీమ్ గెలిచినా ఐపీఎల్ కొత్త ఛాంపియన్ గా నిలుస్తుంది. మరి ట్రోఫీకి ఫస్ట్ కిస్ ఎవరిదో?

ఐపీఎల్ ట్రోఫీతో శ్రేయస్ అయ్యర్, రజత్ పటీదార్ (PTI)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మంగళవారం (జూన్ 3) జరిగే ఫైనల్లో ఉత్కంఠభరిత పోరుకు సిద్ధమవుతున్నాయి. 17 ఏళ్లుగా ఒక్కసారి కూడా ట్రోఫీ సొంతం చేసుకోలేకపోయిన ఆ టీమ్స్.. ఇప్పుడు కప్ కు అడుగు దూరంలో నిలిచాయి. మొట్టమొదటి సారి ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవాలనే లక్ష్యంతో ఉన్నాయి. ఈ రోజు ఐపీఎల్ కొత్త ఛాంపియన్ ఎవరో తేలిపోతుంది.

అక్కడే ఫైనల్

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2025 ఫైనల్ జరుగుతోంది. ఇక్కడే క్వాలిఫయర్ లో ముంబయి పై పంజాబ్ కింగ్స్ గెలిచింది. ఈ సీజన్లో అహ్మదాబాద్లో రెండు సార్లు ఆడిన శ్రేయస్ అయ్యర్ అండ్ కో రెండు సార్లు విజయం సాధించింది. మరోవైపు ఈ ఏడాది ఈ మైదానంలో ఆడని ఆర్సీబీ ఫైనల్ నేపథ్యంలో పరిస్థితులకు ఎలా అలవాటు పడుతుందో చూడాలి. ఈ సీజన్ లో హోం గ్రౌండ్ కాకుండా బయట వేదికలపై ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ ఆర్సీబీ గెలవడం విశేషం.

హెడ్ టు హెడ్

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడు సార్లు తలపడ్డాయి. తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్ తో పాటు క్వాలిఫయర్-1లో భారీ విజయంతో ఆర్సీబీ అదరగొట్టింది. ఇప్పుడు ఫైనల్లో ఏ జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తుందో చూడాలి.

ఆర్సీబీ పేసర్ హేజిల్ వుడ్ ఈ పోరులో కీలక పాత్ర పోషించనున్నాడు. క్వాలిఫయర్-1లో మూడు వికెట్లతో సహా ఈ సీజన్ లో పంజాబ్ పై ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇదిలావుండగా, ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ.. కైల్ జేమీసన్తో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఫామ్ ఇలా

రజత్ పాటిదార్ అండ్ కో ఇటీవల జరిగిన ఏకపక్ష క్వాలిఫయర్-1లో పీబీకేఎస్ ను ఓడించింది. గత ఐదు మ్యాచుల్లో మూడింటిలో విజయం సాధించింది ఆర్సీబీ. ఓ మ్యాచ్ వర్షంతో రద్దయింది. మరోవైపు గత ఐదు మ్యాచుల్లో మూడు విజయాలు, రెండు పరాజయాలు చవిచూసిన పంజాబ్ కింగ్స్ ఫైనల్ లో గెలుపుపై కన్నేసింది.

కెప్టెన్ వర్సెస్ కెప్టెన్

గతేడాది కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా టైటిట్ అందించిన శ్రేయస్ అయ్యర్.. ఈ సీజన్లో పంజాబ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ సీజన్లో స్టైలిష్ బ్యాటర్ 603 పరుగులు సాధించాడు. మరోవైపు కెప్టెన్ గా అరంగేట్రం సీజన్ లోనే తన నాయకత్వ పటిమతో పలువురిని ఆకట్టుకున్నాడు రజత్. అయితే ఈ ఏడాది బ్యాట్ తో పెద్దగా ప్రభావం చూపలేక 14 మ్యాచ్ ల్లో కేవలం 286 పరుగులు మాత్రమే చేశాడు. కానీ కోహ్లి లాంటి సీనియర్ ప్లేయర్ అండ ఉండటం రజత్ కు కలిసొచ్చేదే.

వర్షం పడితే

అహ్మదాబాద్ లో ఈ రోజు వర్షం పడే అవకాశాలు లేవని వాతావరణ శాఖ చెప్పడం ఫ్యాన్స్ కు గుడ్ న్యూసే. కానీ వర్షం పడితే పరిస్థితి ఏంటీ? ఐపీఎల్ ఫైనల్ కు రిజర్వ్ డే ఉంది. ఒకవేళ ఈ రోజు మ్యాచ్ వీలు కాకపోతే రేపు (జూన్ 4) ఫైనల్ నిర్వహిస్తారు. రేపు కూడా వర్షం పడితే కనీసం 5 ఓవర్ల ఆట అయినా నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. అది కూడా సాధ్యం కాకుండా మ్యాచ్ పూర్తిగా రద్దయితే అప్పుడు పంజాబ్ విజేతగా నిలుస్తుంది. ఎందుకంటే లీగ్ దశలో మెరుగైన నెట్ రన్ రేట్ తో ఆర్సీబీ కంటే ముందు ప్లేస్ లో పంజాబ్ నిలిచింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం