తొలి ఐపీఎల్ కప్ కోసం పోరాడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య ఫైనల్ హోరీహోరీగా మొదలైంది. బ్యాట్ తో ఆర్సీబీ పుంజుకుంటుందనే ప్రతిసారి బంతితో పంజాబ్ దెబ్బకొట్టింది. మంగళవారం అహ్మదాబాద్ లో జరుగుతున్న ఐపీఎల్ 2025 టైటిల్ పోరులో ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేయగలిగింది. విరాట్ కోహ్లి (43) టాప్ స్కోరర్.
జేమీసన్ మూడు వికెట్లు పడగొట్టాడు. లాస్ట్ ఓవర్లో 3 పరుగులే ఇచ్చిన అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ 2025 ఫైనల్లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది ఆర్సీబీ. తన భార్య డెలివరీ కోసం ఇంగ్లాండ్ కు వెళ్లిన ఫిల్ సాల్ట్ ఈ టైటిల్ పోరు కోసం తిరిగొచ్చాడు. కోహ్లి, సాల్ట్ కలిసి ఓపెనింగ్ చేశారు. కానీ సాల్ట్ (16) మెరుపులకు జేమీసన్ బ్రేక్ వేశాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే వికెట్ తో ఆర్సీబీకి షాక్ తగిలింది. కానీ మరో ఎండ్ లో కోహ్లి నిలబడ్డాడు.
ఆర్సీబీ బ్యాటర్లు భారీ షాట్లకు ప్రయత్నించారు. బౌండరీలు వచ్చాయి. కానీ ఇన్నింగ్స్ ఊపందుకుంటున్న ప్రతిసారి వికెట్ పడగొట్టి పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. మయాంక్ యాదవ్ (24), కోహ్లి కలిసి ఇన్నింగ్స్ నడిపించారు. 55/1తో పవర్ ప్లేను ఆ టీమ్ మెరుగ్గానే ముగించింది. కానీ ఆ వెంటనే బౌలింగ్ కు వచ్చిన చాహల్.. మయాంక్ ను పెవిలియన్ చేర్చాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ కు వెన్నెముకలా నిలిచాడు. కెప్టెన్ రజత్ పాటీదార్ (26), కోహ్లి మెరుపులతో ఆర్సీబీ 10 ఓవర్లకు 87/2తో నిలిచింది. కానీ ఆ తర్వాత పంజాబ్ గొప్పగా బౌలింగ్ చేసింది. ఫస్ట్ రజత్ ను, ఆ తర్వాత విరాట్ ను పెవిలియన్ చేర్చింది. ముఖ్యంగా క్రీజులో కుదురుకుని, జోరు మీదున్న కోహ్లీ.. తన బౌలింగ్ లోనే అజ్మతుల్లా పట్టిన అద్బుతమైన క్యాచ్ తో ఔటైపోయాడు. ఈ వికెట్ తో ఆర్సీబీ కప్ ఆశలు ప్రమాదంలో పడ్డాయి.
కోహ్లి వికెట్ తో షాక్ లో ఉన్న ఆర్సీబీలో జితేశ్ శర్మ జోష్ తెచ్చాడు. జేమీసన్ బౌలింగ్ లో దిల్ స్కూప్ తో జితేశ్ కొట్టిన సిక్సర్ ఇన్నింగ్స్ కే హైలైట్ గా నిలిచింది. మోకాళ్ల మీద కూర్చుని వికెట్ల వెనకాలకు బంతిని పంపించిన తీరు అద్భుతం. వెంటనే లాంగాఫ్ పై నుంచి మరో సిక్సర్ బాదాడు. అదే ఓవర్లో లివింగ్ స్టన్ మరో సిక్సర్ దంచాడు. కానీ ఔటై వెళ్లిపోవడంతో మరో షాక్ తప్పలేదు.
లక్నోపై చెలరేగిన జితేశ్ శర్మ.. ఫైనల్లోనూ భారీగానే పరుగులు చేసేలా కనిపించాడు. 10 బంతుల్లోనే రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 24 పరుగులు రాబట్టాడు. కానీ వైశాఖ్ బంతిని తప్పుగా అంచనా వేసి బౌల్డయ్యాడు. డకౌట్లోకి వెళ్లి బాధపడ్డాడు. 18వ ఓవర్లో వైశాఖ్ 5 పరుగులే ఇచ్చాడు.
ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్లో అర్ష్ దీప్ అదరగొట్టాడు. ఆర్సీబీ 200 చేయకుండా అడ్డుకున్నాడు. ఆఖరి ఓవర్లో 3 పరుగులే ఇచ్చిన అర్ష్ దీప్ షెఫర్డ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ వికెట్లు పడగొట్టాడు. చివరకు ఆ టీమ్ 190 పరుగులకే పరిమితమైంది.
సంబంధిత కథనం