భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా మధ్యలోనే సస్పెండ్ అయిన ఐపీఎల్ 2025 సీజన్ తిరిగి ప్రారంభం కాబోతోంది. మే 17న సీజన్ రీస్టార్ట్ అవుతోంది. ఇప్పటికే మిగిలిన మ్యాచ్ ల షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించింది. ఆరు నగరాల్లో మ్యాచ్ లు జరుగుతాయని వెల్లడించింది. కానీ ప్లేఆఫ్స్, ఫైనల్ వేదికలను మాత్రం ఖరారు చేయలేదు. అయితే ఫైనల్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్) ఐపీఎల్ 2025 ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు బీసీసీఐ కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ 18వ సీజన్ ఫైనల్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగాలి. కానీ వాతావరణం, సెక్యూరిటీ కారణాల వల్ల ఫైనల్ ను అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఈ టైటిల్ పోరు అహ్మదాబాద్ లో జరిగే ఛాన్స్ ఉంది.
గతంలో అహ్మదాబాద్ రెండుసార్లు ఐపీఎల్ ఫైనల్ కు ఆతిథ్యం ఇచ్చింది. 2022లో గుజరాత్ టైటాన్స్ తమ సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. 2023లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి బంతికి ఫైనల్‌లో జీటీని ఓడించింది. అహ్మదాబాద్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 1.32 లక్షల సీటింగ్ సామర్థ్యంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా కొనసాగుతోంది.
క్రిక్‌బజ్ రిపోర్ట్ చేసినదాన్ని బట్టి చూస్తే ఐపీఎల్ 2025 రెండు ప్లేఆఫ్స్ మ్యాచ్ లకు ముంబయిలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యమిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్ లు అక్కడే జరిగే వీలుది. కానీ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ కోసం రెండో వేదికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. అందుకు వాతావరణ సూచనలే కారణం. నిజానికి ముందు షెడ్యూల్ ప్రకారం కోల్ కతాలో, హైదరాబాద్ లో రెండేసి ప్లేఆఫ్స్ మ్యాచ్ లు జరగాలి.
కానీ టోర్నమెంట్ రీషెడ్యూల్ కారణంగా హైదరాబాద్, కోల్‌కతా నగరాలు ప్లేఆఫ్‌లకు ఆతిథ్యం ఇవ్వడం లేదు. భద్రతాపరమైన సమస్యలు, వాతావరణ పరిస్థితుల కారణంగా ప్లేఆఫ్ వేదికలను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు.
వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం తప్పించడానికి, ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్ లను ఉత్తర భారత నగరానికి కేటాయించే అవకాశం ఉంది. మిగిలిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి ఎంపిక చేసిన ఆరు నగరాల్లో ఇది కూడా ఒకటిగా ఉండబోతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం, జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, లక్నోలోని బీఆర్‌ఎస్‌ఏబీవీ ఏకనా స్టేడియం గురించి ఐపీఎల్ ఆలోచిస్తోంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం కూడా రేసులో ఉంది. లాజిస్టికల్ సమస్యల కారణంగా ఈ ఆరు నగరాల్లో ఒకదాన్ని ఎంపిక చేయనున్నారు.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో 2025లో మ్యాచ్‌ల కోటా పూర్తయింది. ఊహించని వాతావరణం కారణంగా 2015 నుంచి కోల్‌కతాకు ఐపీఎల్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం రాలేదు. హైదరాబాద్‌లో ఒకే ఒక్క హోమ్ గేమ్ మిగిలి ఉంది. సన్ రైజర్స్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించడం కూడా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం షార్ట్‌లిస్ట్‌లో లేకపోవడానికి కారణం.
సంబంధిత కథనం