2020లో ఇంటర్నేషనల్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోని అప్పటి నుంచి కేవలం ఐపీఎల్ లోనే ఆడుతున్నాడు. ఏడాదికి 10 నెలలు ఖాళీగానే ఉంటున్న అతను.. ఐపీఎల్ కోసం ఫిట్ నెస్ కాపాడుకుంటూ వస్తున్నాడు. అలాంటి ధోని.. 43 ఏళ్ల వయసులో ఐపీఎల్ 2025లో చూపించిన వికెట్ కీపింగ్ స్కిల్ కు ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. ఆదివారం (మార్చి 23) ముంబయి ఇండియన్స్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ను ధోని స్టంపౌట్ చేసిన వీడియో వైరలవుతోంది.
సీఎస్కేతో మ్యాచ్ లో కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ తో కలిసి ముంబయి కెప్టెన్ సూర్య ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఆ దశలో నూర్ అహ్మద్ వేసిన 11వ ఓవర్ మూడో బంతికి షాట్ ఆడదామని సూర్య క్రీజు వదిలి ముందుకొచ్చాడు. కానీ స్పిన్ తిరిగిన ఆ బంతిని చటుక్కున అందుకున్న ధోని ఠక్కున బెయిల్స్ లేపేశాడు. కేవలం 0.12 సెకన్ల రిఫ్లెక్షన్ తో ధోని స్టంపౌట్ చేయడం వైరల్ గా మారింది. 43 ఏళ్ల వయసులో 23 ఏళ్ల వికెట్ కీపర్ గా ధోని ఆడుతున్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ధోని స్టంపౌట్ చేశాక చెన్నై ఆటగాళ్లు అప్పీల్ చేశారు. టీవీ అంపైర్ డిసిషన్ కోసం అందరూ ఎదురు చూశారు. కానీ ధోని స్టంపింగ్ స్పీడ్ కు స్టన్ అయిన సూర్య మాత్రం అంపైర్ నిర్ణయం వచ్చేంత వరకూ ఎదురు చూడకుండానే పెవిలియన్ కు వెళ్లిపోయాడు. ధోని స్టంపింగ్ చేశాక ఔట్ కాకుండా ఎలా ఉంటామంటూ సూర్య వెళ్లిపోయాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025లో ఈ స్టంపింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు.
ఐపీఎల్ లో సీఎస్కే తరపున డెబ్యూ చేసిన అఫ్గానిస్థాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ తొలి మ్యాచ్ లోనే నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. కీలకమైన సూర్యకుమార్, తిలక్ వర్మ వికెట్లతో పాటు మరో ఇద్దరినీ బుట్టలో వేసుకున్నాడు. కానీ అంతకంటే ఎక్కువగా ధోని స్టంపింగ్ స్పీడ్ వైరల్ అవుతోంది. వీలైనంత కాలం సీఎస్కేకు ఆడతానని రిటైర్మెంట్ వార్తలను కొట్టిపాడేసిన ధోని.. ఈ వయసులోనూ అమేజింగ్ స్కిల్స్ ప్రదర్శిస్తున్నాడు.
సంబంధిత కథనం