ఐపీఎల్ 2025 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) కెప్టెన్ గా రిషబ్ పంత్ తొలి ఓటమిని ఖాతాలో వేసుకున్నాడు. సోమవారం (మార్చి 24) వైజాగ్ లో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 1 వికెట్ తేడాతో లక్నోపై గెలిచింది. అయితే ఆ మ్యాచ్ ముగిసిన వెంటనే కెప్టెన్ రిషబ్ పంత్ తో ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గొయెంకా మాట్లాడుతూ కనిపించడం వైరల్ గా మారింది. ఆ సమయంలోనే కామెంటరీ బాక్స్ లో ఉన్న దిగ్గజం సునీల్ గావస్కర్.. పంత్ కెప్టెన్సీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
“అతనికి (పంత్) ఏం జరిగిందో (ఢిల్లీ ఓటమి కారణాలు) తెలుసు అనే అనుకుంటున్నా. పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో విజయాల కంటే కూడా తప్పుల నుంచే నేర్చుకుంటామని చెప్పాడు. బాగా బ్యాటింగ్ చేసినప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. కానీ బ్యాట్ లేదా బంతితో ప్రదర్శన చేయనప్పుడు, ఏ విషయాల్లో మెరుగవ్వాలో అర్థమవుతుంది. ఇది కేవలం ఫస్ట్ మ్యాచ్ మాత్రమే. ఇంకా 13 మ్యాచ్ లు ఉన్నాయి. పంత్ తెలివిన క్రికెటర్. బ్యాటింగ్, కెప్టెన్సీలో విలువైన సూచనలను అతను పొందుతాడు’’ అని గావస్కర్ చెప్పాడు.
‘‘అతని (పంత్) ప్రదర్శన బెటర్ అవుతుందని నేను నమ్ముతున్నా. కెప్టెన్ పరుగులు చేసినా లేదా వికెట్లు తీసినప్పుడు ఆ పర్ ఫార్మెన్స్ బౌలింగ్, ఫీల్డింగ్ మార్పులు చేయడంలో వాళ్ల నమ్మకాన్ని గణనీయంగా పెంచుతుంది. ఒకసారి అతను ఎక్కువ పరుగులు చేయడం మొదలెడితే పంత్ కెప్టెన్సీ పై మరింత అష్యురెన్స్ వస్తుందని నమ్ముతున్నా’’ అని గావాస్కర్ అన్నాడు. అంటే ఒకవేళ పంత్ బ్యాటర్ గా రాణించకపోతే అతని కెప్టెన్సీపై కూడా వేటు పడే ప్రమాదం ఉందనేలా సన్నీ వ్యాఖ్యలు చేశాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయింది. ఆ మ్యాచ్ తర్వాత పంత్, హెడ్ కోచ్ లాంగర్ తో సంజీవ్ గొయెంకా మాట్లాడుతూ కనిపించాడు. ఈ టాక్ ఫ్రెండ్లీగానే కొనసాగినట్లు కనిపించినా.. గత సీజన్ లో సన్ రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత కేఎల్ రాహుల్ పై గొయెంకా ఫైర్ అయిన సంఘటనతో దీన్ని పోలుస్తున్నారు. పంత్ ను కూడా బలి చేస్తారని సంజీవ్ గొయెంకాపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
గత సీజన్ తర్వాత కేఎల్ రాహుల్ ను ఎల్ఎస్జీ వదిలేసుకున్న సంగతి తెలిసిందే. వేలంలో పంత్ ను ఆ టీమ్ రూ.27 కోట్లకు కొనుక్కుని, కెప్టెన్ పగ్గాలు అప్పగించింది. కానీ ఎల్ఎస్జీ కెప్టెన్ గా ఫస్ట్ మ్యాచ్ లోనే పంత్ ఫెయిల్ అయ్యాడు. అనుభవజ్ఞుడైన బౌలర్ శార్దూల్ ఠాకూర్ కు రెండు ఓవర్లు ఉన్నప్పటికీ, డీసీకి 12 బంతుల్లో 22 పరుగులు అవసరమైనప్పుడు పంత్ ఐపీఎల్ డెబ్యూ ప్రిన్స్ యాదవ్ కు బౌలింగ్ ఇచ్చాడు. ఆ యువ బౌలర్ చాలా ముఖ్యమైన 19వ ఓవర్ లో 16 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత పంత్ చివరి ఓవర్ లో షాబాజ్ అహ్మద్ తో బౌలింగ్ చేయించాడు.
సంబంధిత కథనం