ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అశుతోష్ శర్మ సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ హిస్టరీలోనే గ్రేటెస్ట్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ల్లో ఇది ఒకటిగా మిగిలిపోనుంది. 31 బంతుల్లోనే 66 పరుగులు చేసి టీమ్ ను గెలిపించాడు. అయితే ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా ఆడిన అశుతోష్.. చేతి వేలి గాయంతోనే ఈ అద్భుత బ్యాటింగ్ తో టీమ్ ను గెలిపించాడని కోచ్ హేమంగ్ బదాని వెల్లడించాడు.
మ్యాచ్ ముగిశాక.. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్ లో హెడ్ కోచ్ హేమంగ్ బదాని మాట్లాడాడు. ఫింగర్ కట్ అయినా టైగర్ మెంటాలిటీతో అశుతోష్ అదరగొట్టాడని కోచ్ వెల్లడించాడు.
"ఈ యువకుడి (అశుతోష్) గురించి నేను చెప్పాలి. అతని ఫింగర్ కట్ అయింది. మ్యాచ్ ఆడే అవకాశం కనిపించలేదు. రెండు రోజుల ముందు అతనితో మాట్లాడా. 'ఎలా ఉన్నావు? ఆడతావా?' అని అడిగా. ‘కచ్చితంగా ఆడతా. నేను మ్యాచ్ లో ఉండాలనుకుంటున్నా’ అని స్పష్టం చేశాడు. అనుకున్నట్లే గాయాన్ని దాటి బ్యాటింగ్ చేశాడు. ఎంతో గొప్పగా ఆడాడు. ఓ దశలో 15 బంతుల్లో 15 పరుగులే చేసిన అతను.. చివరకు 31 బంతుల్లో 66 పరుగులతో మ్యాచ్ ను గొప్పగా ముగించాడు" అని హేమంగ్ బదాని చెప్పాడు.
యువ ప్లేయర్ అశుతోష్ శర్మ రాత్రికి రాత్రే స్టార్ బ్యాటర్ గా ఎదిగాడు. అసలు ఆశలే లేని స్థితిలో అద్భుత పోరాటంతో ఢిల్లీ క్యాపిటల్స్ ను అతను గెలిపించాడు. ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వచ్చి టీమ్ ను విన్నింగ్ లైన్ దాటించాడు. 210 పరుగుల ఛేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓ దశలో 65/5తో ఓటమి దిశగా సాగింది. కానీ సెన్సేషనల్ ఇన్నింగ్స్ తో అశుతోష్ కథ మార్చేశాడు. వైజాగ్ లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీకి విజయాన్ని అందించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఛేజింగ్ లో జట్టు పీకల్లోతు కష్టాల్లోపడ్డప్పుడు క్రీజులోకి వచ్చిన అశుతోష్.. నెమ్మదిగానే బ్యాటింగ్ మొదలెట్టాడు. స్టార్టింగ్ లో బంతికో పరుగు మాత్రమే సాధించాడు. కానీ జట్టు పరిస్థితి క్లిష్టంగా మారిన టైమ్ లో ఒక్కసారిగా జూలు విదిల్చాడు. భారీ షాట్లతో రెచ్చిపోయాడు. అలవోకగా సిక్సర్లు కొట్టాడు. అసాధ్యమనుకున్న విజయాన్ని జట్టుకు సాధించి పెట్టాడు. సిక్సర్ తోనే మ్యాచ్ ముగించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. ఈ అవార్డును తన మెంటార్ శిఖర్ ధావన్ కు అశుతోష్ అంకితం చేశాడు. గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున మెరుపు ఇన్నింగ్స్ లతో అశుతోష్ అలరించిన సంగతి తెలిసిందే.
సంబంధిత కథనం