శనివారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చివరి ఓవర్ వరకు క్రికెట్ అభిమానులకు ఉత్కంఠను పంచింది. ఈ థ్రిల్లర్ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తు చేసింది. మెరుపు ఇన్నింగ్స్‌తో సమీర్ రిజ్వీ ఢిల్లీకి అద్భుత విజయాన్ని అందించాడు. సమీర్ రిజ్వీతో పాటు కరణ్ నాయర్ రాణించడంతో పంజాబ్ విధించిన 207 పరుగుల టార్గెట్‌ను మరో మూడు బాల్స్ మిగిలుండగానే ఢిల్లీ ఛేదించింది.
207 పరుగుల టార్గెట్‌తో సెకండ్ బ్యాటింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్, డుప్లెసిస్ చక్కటి ఆరంభాన్ని అందించారు. కేఎల్ రాహుల్ 21 బాల్స్‌లో ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేయగా...కెప్టెన్ డుప్లెసిస్ 15 బాల్స్‌లో రెండు ఫోర్లు ఓ సిక్సర్‌తో 21 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. తొలి వికెట్‌కు వీరిద్దరు ఐదు ఓవర్లలోనే యాభై పరుగులు జోడించారు. ఓపెనర్లు ఔటైనా సెదికుల్లా అటల్‌తో కలిసి ఢిల్లీని లక్ష్యం దిశగా నడిపించాడు కరణ్ నాయర్. ధనాధన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.
హాఫ్ సెంచరీకి చేరువ అవుతోన్న తరుణంలో హర్‌ప్రీత్ బార్ బౌలింగ్‌లో కరణ్ నాయర్ ఔటయ్యాడు. 27 బాల్స్‌లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 44 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. సెదికుల్లా కూడా 22 పరుగులకే ఔటవ్వడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది.
ఐదో స్థానంలో బ్యాటింగ్ దిగిన సమీర్ రిజ్వీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పంజాబ్ బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. రిజ్వీ దూకుడుతో చివరి రెండు ఓవర్లలో ఢిల్లీ 22 పరుగుల దూరంలో నిలిచింది. అర్షదీప్ వేసిన పంతొమ్మిదో ఓవర్‌లో ఓ సిక్స్ కొట్టి 22 బాల్స్‌లోనే తన హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు రిజ్వీ. స్టబ్స్ కూడా ఓ ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి.
చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి ఎనిమిది పరుగులు అవసరం కాగా...మూడో బాల్‌కు సిక్స్ కొట్టి ఢిల్లీని గెలిపించాడు రిజ్వీ. 25 బాల్స్‌లో ఐదు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 58 పరుగులు చేసిన రిజ్వీ నాటౌట్‌గా నిలిచాడు. స్టబ్స్ (18 పరుగులతో) తో కలిసి ఢిల్లీకి మరో మూడు బాల్స్ మిగిలుండగానే రిజ్వీ విజయాన్ని అందించాడు.
పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ రెండు వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 53 పరుగులతో రాణించగా...చివర్లో స్టాయినిస్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో (16 బాల్స్‌లో 44 రన్స్) ఆకట్టుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్ పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌కు వెళ్లేది. కానీ ఓటమి పాలవ్వడంతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. గుజరాత్ టాప్ ప్లేస్‌లో ఉంది. 14 మ్యాచుల్లో ఏడు విజయాలతో ఢిల్లీ ఐదో స్థానంలో నిలిచింది.
సంబంధిత కథనం