IPL 2025 KKR vs RR: దంచికొట్టిన డికాక్.. పోరు వన్ సైడ్.. కేకేఆర్ బోణీ.. రాజస్థాన్ చిత్తు-ipl 2025 de kock sensational innings unbeaten 97 runs kolkata knight riders won match by 8 wickets rajasthan royals ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2025 Kkr Vs Rr: దంచికొట్టిన డికాక్.. పోరు వన్ సైడ్.. కేకేఆర్ బోణీ.. రాజస్థాన్ చిత్తు

IPL 2025 KKR vs RR: దంచికొట్టిన డికాక్.. పోరు వన్ సైడ్.. కేకేఆర్ బోణీ.. రాజస్థాన్ చిత్తు

IPL 2025 KKR vs RR: ఐపీఎల్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ బోణీ కొట్టింది. ఈ సీజన్ లో తమ తొలి మ్యాచ్ లో సొంతగడ్డపై ఆర్సీబీ చేతిలో ఓడిన కేకేఆర్.. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ను దాని హోం గ్రౌండ్ లోనే చిత్తుచేసింది. డికాక్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాడు.

మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన డికాక్ (AFP)

కేకేఆర్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (61 బాల్స్ లో 97 నాటౌట్) చెలరేగాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టును గెలిపించాడు. బుధవారం (మార్చి 26) గువాహటిలో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట రైడర్స్ 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ఈ డిఫెండింగ్ ఛాంపియన్ ఈ సీజన్ లో పాయింట్ల ఖాతా తెరిచింది. డికాక్ దంచుడుతో 2 వికెట్లే కోల్పోయిన కేకేఆర్ 17.3 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది.

కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లతో రాజస్థాన్ ను కట్టడి చేశారు. రాజస్థాన్ లో ధ్రువ్ జురెల్ (33) టాప్ స్కోరర్.

డికాక్ జోరు

ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ పై ఛేజింగ్ ను కేకేఆర్ నెమ్మదిగా మొదలెట్టింది. నరైన లేకపోవడంతో డికాక్ తో కలిసి మొయిన్ అలీ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. రెండు ఓవర్లకు స్కోరు 7 మాత్రమే. కానీ మూడో ఓవర్ నుంచి డికాక్ దంచుడు మొదలెట్టాడు. మరోవైపు ఓపెనర్ గా మొయిన్ ఫెయిల్ అయ్యాడు. 12 బంతుల్లో 5 పరుగులే చేసి రనౌటయ్యాడు. కెప్టెన్ రహానె (18) ఈ సారి మెరుపులు మెరిపించలేకపోయాడు. అతణ్ని ఔట్ చేసిన హసరంగ.. తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్లో సంబరాలు చేసుకున్నాడు.

చివరి వరకూ

ఓ వైపు వికెట్లు పడ్డా మరో ఎండ్ లో డికాక్ సిక్సర్ల వేట కొనసాగించాడు. యువ బ్యాటర్ అంగ్ క్రిష్ రఘువన్శీ (22 నాటౌట్) కూడా డికాక్ కు చక్కగా హెల్ప్ చేశాడు. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్న డికాక్.. కేకేఆర్ ను టార్గెట్ దిశగా నడిపించాడు. మరోవైపు బౌలింగ్, ఫీల్డింగ్ లో రాజస్థాన్ ఎఫెక్టివ్ గా కనిపించలేదు. రఘువన్శీ రనౌట్ ఛాన్స్ ను ఆ టీమ్ మిస్ చేసింది.

కేకేఆర్ విజయానికి 19 బంతుల్లో 23 పరుగులు చేయాల్సి ఉండగా.. తీక్షణ వేసిన వైడ్ బౌండరీకి వెళ్లింది. దీంతో ఈక్వేషన్ ఈజీగా మారింది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఆర్చర్ బౌలింగ్ లో డికాక్ ఓ ఫోర్, రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్ ముగించాడు. డికాక్ 61 బాల్స్ లో 97 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. అతను 8 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు.

ఫోర్ తో మొదలైనా

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ చప్పగా సాగింది. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (29) ఫోర్ తో ఇన్నింగ్స్ ప్రారంభించినా.. ఆ తర్వాత కేకేఆర్ బౌలర్ల ధాటికి రాజస్థాన్ నెమ్మదించింది. 11 బంతులాడి 13 పరుగులే చేసిన శాంసన్ ను వైభవ్ అరోరా బౌల్డ్ చేశాడు.

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (25) మూడు సిక్సర్లు కొట్టి వెళ్లిపోయాడు. కేకేఆర్ తరపున తొలి మ్యాచ్ ఆడిన మొయిన్ అలీ కట్టుదిట్టంగా బంతులేశాడు. పరాగ్, హసరంగను వరుణ్.. జైస్వాల్, నితీశ్ రాణాను మొయిన్ ఔట్ చేశారు.

కానీ 28 బంతుల్లో 33 పరుగులు చేసిన జురెల్ ను హర్షిత్ రాణా ఔట్ చేశాడు. అదే ఓవర్లో ప్రమాదకర హెట్ మయర్ (7) నూ పెవిలియన్ చేర్చాడు. చివర్లో ఆర్చర్ రెండు సిక్సర్లు కొట్టడంతో రాజస్థాన్ 150 దాటగలిగింది.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం