అదరగొట్టిన అభిషేక్, కేఎల్ రాహుల్.. లక్నో పై ఢిల్లీ ఘన విజయం-ipl 2025 dc vs lsg delhi capitals won by 8 wickets lucknow super giants abishek porel kl rahul shine with fifties ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  అదరగొట్టిన అభిషేక్, కేఎల్ రాహుల్.. లక్నో పై ఢిల్లీ ఘన విజయం

అదరగొట్టిన అభిషేక్, కేఎల్ రాహుల్.. లక్నో పై ఢిల్లీ ఘన విజయం

ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ దూసుకెళ్తోంది. మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అభిషేక్ పోరెల్, కేెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ ను ఢిల్లీ చిత్తుచేసింది.

అదరగొట్టిన కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్ (AP)

ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. ఈ సీజన్ లో 8 మ్యాచ్ ల్లో ఆరో విజయంతో ప్లేఆఫ్స్ కు మరింత చేరువైంది. మంగళవారం (ఏప్రిల్ 22) లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఛేజింగ్ లో ఢిల్లీ 2 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది. అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 51; 5 ఫోర్లు, ఓ సిక్సర్), కేఎల్ రాహుల్ (42 బంతుల్లో 57; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. గత సీజన్ లో లక్నోకు ఆడిన రాహుల్.. ఇప్పుడే అదే టీమ్ పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్ లో లక్నోకు ఇది నాలుగో ఓటమి.

అభిషేక్ అదుర్స్

ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తో ఛేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ ఓపెనర్ అభిషేక్ పోరెల్ అదరగొట్టాడు. కరుణ్ నాయర్ (15) త్వరగానే ఔటయ్యాడు. అయినా అభిషేక్, కేఎల్ రాహుల్ కలిసి ఢిల్లీని విజయం దిశగా నడిపించారు. బ్యాటింగ్ కు కష్టంగా ఉన్న పిచ్ పై ఈ జోడీ అద్భుతంగా ఆడింది.

ముఖ్యంగా అభిషేక్ అమేజింగ్ షాట్లతో అలరించాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్ లో అతను కళ్లు చెదిరే సిక్సర్ కొట్టాడు. మధ్యలో బౌండరీలు రాకపోయినా రాహుల్, అభిషేక్ సింగిల్స్ తో స్ట్రైక్ రొటేట్ చేశారు. టీమ్ ను గెలుపు రేసులోనే ఉంచారు. రాహుల్ ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డా ఆ తర్వాత జోరందుకున్నాడు. 10 ఓవర్లకు ఢిల్లీ 80/1తో నిలిచింది.

ఆ వికెట్ పడ్డా

హాఫ్ సెంచరీ తర్వాత అభిషేక్ ఔటైనా ఢిల్లీకి ఇబ్బంది లేకుండా పోయింది. ఎందుకంటే కెప్టెన్ అక్షర్ పటేల్ తో కలిసి టీమ్ ను కేఎల్ రాహుల్ గెలిపించాడు. బిష్ణోయ్ ఓవర్లో అక్షర్ రెండు సిక్సర్లు కొట్టారు. ఈ సీజన్ లో మరో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్న కేఎల్ రాహుల్ సిక్సర్ తో మ్యాచ్ ముగించాడు. 13 బాల్స్ మిగిలి ఉండగానే ఢిల్లీ గెలిచింది. అక్షర్ 20 బంతుల్లో 34 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఓ ఫోర్, 4 సిక్సర్లు కొట్టాడు.

మెరిసిన మార్ క్రమ్, మార్ష్

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ మధ్యలో గాడి తప్పింది. ఆ టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్ క్రమ్ (33 బంతుల్లో 52; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (36 బంతుల్లో 45; 3 ఫోర్లు, ఓ సిక్సర్) సత్తాచాటారు.

కానీ మధ్యలో ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లతో లక్నో జోరుకు బ్రేక్ వేశాడు. కనీసం 180 స్కోరు చేసేలా ఫస్ట్ కనిపించిన లక్నో.. ముకేశ్ దెబ్బకు 160 కూడా చేయలేకపోయింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం