ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కు తిరుగేలేదే. కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్ సారథ్యంలో అన్‌స్టాపబుల్‌గా డీసీ దూసుకెళ్తోంది. ఈ సీజన్ లో హ్యాట్రిక్ విక్టరీలు ఖాతాలో వేసుకుంది. శనివారం (ఏప్రిల్ 5) చెపాక్ లో జరిగిన మ్యాచ్ లో ఆ టీమ్ 25 పరుగుల తేడాతో గెలిచింది. ఛేజింగ్ లో సీఎస్కే 158/5 స్కోరు మాత్రమే చేసింది. విజయ్ శంకర్ (54 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, ఓ సిక్సర్) స్లో హాఫ్ సెంచరీ పనికిరాకుండా పోయింది. ధోని (26 బంతుల్లో 30 నాటౌట్) మెరుపులు మిస్సయ్యాయి.
ఐపీఎల్ 2025లో సీఎస్కేతో మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 183 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 77 పరుగులు; 6 పోర్లు, 3 సిక్స్‌లు) హిట్టింగ్‍తో రెచ్చిపోయాడు. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ లో సీఎస్కేకు ఇది హ్యాట్రిక్ ఓటమి. 15 ఏళ్ల తర్వాత చెపాక్ లో సీఎస్కేపై ఢిల్లీకి ఇదే తొలి విక్టరీ. చివరగా 2010లో ఇక్కడ డీసీ గెలిచింది.
ఐపీఎల్ 2025లో హోం గ్రౌండ్ చెపాక్ లో ఛేజింగ్ దిగిన సీఎస్కే ఫెయిల్ అయింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే రచిన్ రవీంద్ర (3)ను రిటర్న్ క్యాచ్ తో ముకేశ్ కుమార్ పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే కెప్టెన్ రుతురాజ్ (5)ను స్టార్క్ ఔట్ చేసి చెన్నైని చావుదెబ్బ కొట్టాడు.
ఆల్ రౌండర్ గా అదరగొడుతున్న ఢిల్లీ ఆటగాడు విప్రజ్ నిగమ్ మరోసారి బాల్ లో అదరగొట్టాడు. లెగ్ స్పిన్ తో సత్తాచాటాడు. డెవాన్ కాన్వే (13), శివమ్ దూబె (18)లను బోల్తా కొట్టించాడు. స్పిన్ కు చక్కగా సహకరిస్తున్న చెపాక్ పిచ్ పై విప్రజ్ ఎక్స్ లెంట్ గా బౌలింగ్ చేశాడు. జడేజా (2)ను కుల్ దీప్ బుట్టలో వేసుకోవడంతో 11 ఓవర్లలో 76/5తో సీఎస్కే పనైపోయింది.
ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో సీఎస్కే ఓటమి ఖాయమైనా.. చెపాక్ స్టేడియం మాత్రం దద్దరిల్లింది. అందుకు కారణం ధోని బ్యాటింగ్ కు రావడమే. కానీ 11వ ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన ధోని స్పీడ్ గా ఆడలేకపోయాడు. మరో ఎండ్ లో వికెట్ కాపాడుకుంటూ వచ్చిన విజయ్ శంకర్ కూడా బౌండరీలు కొట్టలేకపోయాడు. చెన్నై బౌలర్ల అద్భుతమైన బౌలింగే అందుకు కారణం.
పదో ఓవర్లో ఫస్ట్ బాల్ కు దూబె సిక్సర్ కొట్టిన తర్వాత.. మళ్లీ 14వ ఓవర్లో అయిదో బంతికి శంకర్ ఫోర్ కొట్టాడు. మధ్యలో ఒక్క బౌండరీ కూడా రాలేదు. 15 ఓవర్లకు సీఎస్కే 106/5తో నిలిచింది. ఆ టీమ్ గెలవాలంటే 30 బాల్స్ లో 78 రన్స్ చేయాలనే పరిస్థితి. ఆ దశలో ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బంతులేశారు.
ఒకప్పటి ధోని మెరుపులు కనిపించలేదు. అతను క్రీజులో ఉన్నాడంటే సీఎస్కే గెలుస్తుందనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉండేది. కానీ 43 ఏళ్ల వయసులో ఏడాదిలో కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోనీలో ఆ మ్యాజిక్ మిస్ అయింది. ధోని టీమ్ ను గెలిపిస్తాడని కోరుకోవడమూ అత్యాశేనని చెప్పొచ్చు. 18 బాల్స్ లో 14 పరుగులే చేసిన ధోని.. ముకేశ్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టినా అప్పటికే లేట్ అయింది.
మరోవైపు 43 బాల్స్ లో విజయ్ శంకర్ చేసిన హాఫ్ సెంచరీ పనికిరాకుండా పోయింది. స్టార్క్ వేసిన 19వ ఓవర్ తొలి రెండు బంతుల్లోనే 10 రన్స్ రావడంతో ఏమైనా సంచలనం జరుగుతుందేమోనని సీఎస్కే ఫ్యాన్స్ ఆశించారు. కానీ లాస్ట్ ఓవర్లో ఆ టీమ్ విజయానికి 41 రన్స్ చేయాల్సి రావడంతో ఢిల్లీ విక్టరీ ఖాయమైంది. అంతా అయిపోయాక శంకర్ ఫస్ట్ సిక్సర్ కొట్టడం గమనార్హం.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‍కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‍గుర్క్ (0) తొలి ఓవర్ ఐదో బంతికి డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ నిలకడగా ఆడాడు. అభిషేక్ పోరెల్ (20 బంతుల్లో 33 పరుగులు; 4 ఫోర్లు, ఓ సిక్స్) దూకుడుగా హిట్టింగ్ చేశాడు. ఏడో ఓవర్లో పోరెల్‍ను ఔట్ చేశాడు చెన్నై స్పిన్నర్ రవీంద్ర జడేజా.
పోరెల్ ఔటయ్యాక కేఎల్ రాహుల్ దూకుడు పెంచాడు. హిట్టింగ్ రోల్ తీసుకున్నాడు. అదిరిపోయే షాట్లతో మోతెక్కించాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ (14 బంతుల్లో 21 పరుగులు) ఉన్నంతలో వేగంగా ఆడాడు. సమీర్ రిజ్వి (15 బంతుల్లో 20 పరుగులు) కాసేపు నిలిచాడు. రాహుల్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేరుకున్నాడు. కానీ ఆఖర్లో సీఎస్కే కట్టడి చేసింది. ఢిల్లీ లాస్ట్ 5 ఓవర్లలో 43 పరుగులే చేసింది.
సంబంధిత కథనం