డేవిడ్ అద్భుత పోరాటం.. కానీ ఆర్సీబీ మళ్లీ ఢమాల్.. అదరగొట్టిన పంజాబ్ బౌలర్లు-ipl 2025 david fights back but rcb fails again punjab bowling impresses ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  డేవిడ్ అద్భుత పోరాటం.. కానీ ఆర్సీబీ మళ్లీ ఢమాల్.. అదరగొట్టిన పంజాబ్ బౌలర్లు

డేవిడ్ అద్భుత పోరాటం.. కానీ ఆర్సీబీ మళ్లీ ఢమాల్.. అదరగొట్టిన పంజాబ్ బౌలర్లు

ఐపీఎల్ 2025లో హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్లాప్ షో కొనసాగుతోంది. రెయిన్ కండీషన్స్ ను కరెక్ట్ గా వాడుకున్న పంజాబ్ కింగ్స్.. ఆర్సీబీని చావుదెబ్బ కొట్టింది. కానీ టిమ్ డేవిడ్ ఫైటింగ్ ఫిఫ్టీతో ఆర్సీబీకి పోరాడే స్కోరు అందించాడు.

ఆర్సీబీని ఆదుకున్న టిమ్ డేవిడ్ (AP)

వర్షంతో బౌలింగ్ కు అనుకూలంగా మారిన పరిస్థితులు.. బ్యాటింగ్ కు కష్టంగా పిచ్. ఇంకేముంది.. టాస్ గెలిచి బౌలింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ చెలరేగిపోయింది. ఆ టీమ్ బౌలర్లు వికెట్ల వేటలో రెచ్చిపోయారు. దీంతో మరోసారి హోం గ్రౌండ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు పరాభవం తప్పేలా కనిపించడం లేదు.

శుక్రవారం (ఏప్రిల్ 18) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 14 ఓవర్లలో 9 వికెట్లకు 95 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (26 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆర్సీబీని ఆదుకున్నాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను ఇన్నింగ్స్ కు 14 ఓవర్ల చొప్పున కుదించారు.

అర్ష్‌దీప్‌ అదుర్స్

గాలిలో తేమ, లైఫ్ ఉన్న పిచ్.. ఈ పరిస్థితులను చక్కగా ఉపయోగించుకుంటూ పంజాబ్ కింగ్స్ బౌలర్లు సత్తాచాటారు. కొత్త బంతితో అర్ష్‌దీప్‌ సింగ్ బెంబేలెత్తించాడు. తన వరుస ఓవర్లలో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (4), విరాట్ కోహ్లి (1)ని పెవిలియన్ చేర్చాడు. సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లి.. షాట్ మిస్ అవడంతో మిడాన్ లో యాన్సెన్ చేతికి చిక్కాడు. దీంతో వర్షం పడుతున్నా అప్పటివరకూ ఎంతో ఓపికగా ఎదురు చూసిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.

అటు స్పిన్.. ఇటు పేస్

ఓ ఎండ్ నుంచి స్పిన్ తో చాహల్, మరో ఎండ్ నుంచి పేసర్లు.. ఆర్సీబీ బ్యాటర్లకు ఉచ్చు బిగించారు. లివింగ్ స్టన్ ను జేవియర్ ఔట్ చేశాడు. ఆ తర్వాత చాహల్, యాన్సెన్ కలిసి ఆర్సీబీ పనిపట్టారు. గత మ్యాచ్ లో కేకేఆర్ పై అద్భుత ప్రదర్శన చేసిన చాహల్.. ఆర్సీబీపైనా మ్యాజిక్ కొనసాగించాడు. తన వరుస ఓవర్లలో జితేశ్ శర్మ, కెప్టెన్ రజత్ పటీదార్ ను వెనక్కి పంపాడు.

కాస్తో కూస్తో పోరాడిన రజత్ పటీదార్ 18 బంతుల్లో 23 పరుగులు చేశాడు. ఇక మరోవైపు యాన్సెన్ తన వరుస ఓవర్లలో కృనాల్ పాండ్య‌, ఇంపాక్ట్ ప్లేయర్ మనోజ్ భండాగేను పెవిలియన్ చేర్చడంతో 42/7తో ఆర్సీబీ పనైపోయింది.

డేవిడ్ పోరాటం

హ‌ర్‌ప్రీత్ బ్రార్ ఒకే ఓవర్లో రెండు వికెట్లతో ఆర్సీబీ పతనాన్ని మరింత వేగవంతం చేశాడు. ఈ స్నిన్నర్ వరుస బంతుల్లో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ ను ఔట్ చేశాడు. కానీ మరో ఎండ్ లో టిమ్ డేవిడ్ పోరాడాడు. బౌండరీలతో సత్తాచాటాడు. పవర్ హిట్టింగ్ తో ఫ్యాన్స్ ను కాస్తయినా ఎంటర్ టైన్ చేశాడు.

హ‌ర్‌ప్రీత్ వేసిన లాస్ట్ ఓవర్లో డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టాడు. 48 రన్స్ తో నాటౌట్ గా నిలిచిన డేవిడ్ పెవిలియన్ బాట పట్టాడు. కానీ ఆఖరి బంతి నోబాల్ కావడంతో మళ్లీ బ్యాటింగ్ కు వచ్చి రెండు పరుగులు తీసి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్‌, యాన్సెన్, చాహల్, హ‌ర్‌ప్రీత్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం