ఐపీఎల్ లో పేలవ ప్రదర్శనతో సాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది. శుక్రవారం (ఏప్రిల్ 25) చెపాక్ లో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. 8 మ్యాచ్ లాడిన ఈ రెండు టీమ్స్ చెరో రెండు మ్యాచ్ లు గెలిచాయి. సన్ రైజర్స్ 9వ, సీఎస్కే 10వ స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్ సీఎస్కే కెప్టెన్ ధోనికి 400వ టీ20 కావడం విశేషం.
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ కు బ్యాటింగే పెద్ద ప్రాబ్లమ్. ఈ సీజన్ లో బ్యాటింగ్ లో వైఫల్యంతో ఈ టీమ్స్ వరుసగా ఓడుతున్నాయి. హోం గ్రౌండ్ లోనూ గెలవలేకపోతున్నాయి. సీజన్ ను విక్టరీతో స్టార్ట్ చేసిన సీఎస్కే ఆ తర్వాత వరుసగా 5 మ్యాచ్ ల్లో ఓడింది. లక్నోపై గెలిచినా వెంటనే.. ముంబయి చేతిలో పరాజయం పాలైంది.
రచిన్ రవీంద్ర, జడేజా, శివమ్ దూబె, విజయ్ శంకర్ లాంటి ఆటగాళ్లున్నా బ్యాటింగ్ లో టీమ్ రాణించలేకపోతోంది. బౌలింగ్ లో నూర్ అహ్మద్ మాత్రమే ఫర్వాలేదనిపిస్తున్నాడు. బేబీ ఏబీ డివిలియర్స్ గా పేరు తెచ్చుకున్న దక్షిణాఫ్రికా యువ ఆటగాడు డెవాల్డ్ బ్రేవిస్ ఈ మ్యాచ్ లో సీఎస్కే తరపున అరంగేట్రం చేస్తున్నాడు. విజయ్ శంకర్ స్థానంలో దీపక్ హుడా ఆడుతున్నాడు.
భీకరమైన బ్యాటింగ్ లైనప్ తో గతేడాది ఐపీఎల్ లో రికార్డుల దుమ్ము దులిపిన సన్ రైజర్స్.. ఈ సారి దారుణంగా విఫలమవుతోంది. అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ పరుగులు చేయలేకపోతున్నారు. క్లాసెన్ (281) మాత్రమే రాణిస్తున్నాడు. అతను బ్యాటింగ్ ఆర్డర్లో పైన వచ్చి ఇన్నింగ్స్ నిర్మించాల్సి ఉంది.
టీమ్ బ్యాలెన్స్ కూడా సరిగ్గా ఉండటం లేదు. బౌలర్ల రొటేషన్ పని చేయడం లేదు. కమిన్స్, హర్షల్ పటేల్, షమి.. ఇలా ఏ బౌలర్ అయినా వికెట్ల వేటలో విఫలమవుతున్నారు.
సీఎస్కే, సన్ రైజర్స్ 8 మ్యాచ్ ల్లో రెండు మాత్రమే గెలిచాయి. ఈ మ్యాచ్ లో ఓడిన టీమ్ ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమిస్తుంది. ఇది రెండు జట్లకు డూ ఆర్ డై మ్యాచ్. మరి ఈ చావోరేవో పోరులో ఏ టీమ్ గెలుస్తుందో చూడాలి. చెపాక్ లో పిచ్ స్పిన్ కు అనుకూలం.
సంబంధిత కథనం